close
Choose your channels

బాలకృష్ణ చేతులమీదుగా 'సతీ తిమ్మమాంబ' ఆడియో విడుదల

Friday, October 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ వెంకట్, భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత లకు అందించారు.

ఈ సందర్భంగా..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం, కదిరి లాంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఆ జిల్లాలోని సుమారుగా 7 ఎకరాల్లో తిమ్మమాంబ మర్రిమాను ఉంది. అది గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. దానికి సంబంధించిన చరిత్ర మీద సినిమాను తీయడం అభినందించాల్సిన విషయం. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయమంటే నేను చెవి కోసుకుంటాను. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న తెలుగు జాతి మనది. కాని ఈరోజుల్లో తెలుగును మర్చిపోయే రోజులు కనిపిస్తున్నాయి. పరభాష ప్రభావం జనాలపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చరిత్రకు సంబంధించిన సినిమా రావడం అభినందనీయం. అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది. దానికోసం కృష్ణదేవరాయులు ఆ కాలంలోనే ఎన్నో చెరువులను కట్టించారు. వారి కుటుంబ సభ్యురాలైన తిమ్మమాంబ భర్తతో పాటు సతీసహగమనం చెందింది. ఆవిడ జీవిత చరిత్రను చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బండారు దానయ్య మంచి సంగీతం ఇస్తాడు. సినిమా పాటలు హిట్ అయితే కమర్షియల్ గా సినిమా కూడా సగం హిట్ అయినట్లే. ఈ సినిమా మంచి హిట్ సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రాత్మక, జానపద చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అనంతపురం జిల్లాలోని మహావృక్షమైన మర్రిమాను 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆ చరిత్రకు సంబంధించిన చిత్రమిది. చారిత్రక సత్యాన్ని తీసుకొని సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.. అని చెప్పారు.

పరిటాల సునీత మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలోని మర్రిమాను వృక్షం గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఆ చరిత్రపై వస్తున్న ఈ చిత్రం కూడా గిన్నిస్ బుక్ లో చేరాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

సంగీత దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. నాటుకోడికూర అనే పాటకు బాలకృష్ణ గారి చేతులమీదుగా అవార్డు తీసుకున్నాను. కళలన్నా.. కళాకారులన్నా ఆయనకు ఎంతో అభిమానం. గోరంత పండు లాంటి మా చిత్రాన్ని కొండంత చేసిన బాలయ్య గారికి థాంక్స్. ఓ చారిత్రాత్మక చిత్రానికి సంగీతం అందిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది.. అని చెప్పారు.

దర్శకుడు బాలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ రాసుకున్న తరువాత బైరవద్వీపం సినిమా చూసి ఆర్టిస్టులు ఎలా పెర్ఫార్మ్ చేస్తే బావుంటుంది.. ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉపయోగించాలనే విషయాలు నేర్చుకున్నాను. ఆ సినిమా అంత గొప్పగా తీయలేకపోయినా మా చిత్రం మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం మాకుంది. బాలకృష్ణ గారి కోసం 'శివరావణ యుద్ధం' అనే కథను రాసుకున్నాను. ఆయనకు వీలైతే సినిమా చేయాలని భావిస్తున్నాను.. అని చెప్పారు.

నిర్మాత పెద్దరాసు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మా కుటుంబ చరిత్రను నాన్నగారి ద్వారా తెలుసుకున్నప్పుడే సినిమాగా చేయాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు నేను ఈ స్థానంలో ఉండడానికి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల రవీంద్ర లు ఎంతగానో సహకరించారు. పెద్దరాసు వీరయ్య గారి పేరు మీద కళాశాల కూడా ప్రారంభించాం. మొదట ఈ చిత్రాన్ని సీరియల్స్ గా చేసి పది ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేసాం. కాని స్లాట్ దొరకకపోవడం వలన మొత్తం ప్రదర్శించలేకపోయాం. అందరి సహకారంతో సినిమాగా తీర్చిదిద్ది విడుదల చేయనున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, సి.కళ్యాణ్, అబ్దుల్ గని, చంద్రబోస్, ఆర్ పి పట్నాయక్, ఉదయ్ భాస్కర్, శ్రీవెంకట్, భవ్యశ్రీ, మునిరత్నం శ్రీనివాసులు, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, పాటలు: బందరు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్: వినయ్, దర్శకత్వ పర్యవేక్షణ : ఎస్. రామ్ కుమార్, నిర్మాత: పెద్దరాసు సుబ్రహ్మణ్యం, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.