 ఎనర్జిటిక్ హీరోగా పేరుపొందిన 'హ్యాపీడేస్' నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'డిస్కో' విడుదలైన రోజే తుస్సుమనిపించింది. పూరి జగన్నాథ్ శిష్యుడు హరికృష్ణ (హరి కె. చందూరి) డైరెక్టర్ కావడంతో ఈ సినిమా మినిమంగానైనా బాగుంటుందని ఆశించిన వాళ్లందర్నీ నిరాశపరిచింది. కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే కథా కథనాలు, హరి డైరెక్షన్ సినిమాని పరమ బోరింగ్ గా తయారుచేశాయి. టైటిల్ రోల్ లో నిఖిల్ ఓవరాక్షన్ చేశాడు. ఆద్యంతం అతడిలో పవన్ కల్యాణ్, రవితేజల ఇమిటేషనే కనిపించింది.
అనాథ హీరోల కథలు ఇప్పడికే ఇబ్బడి ముబ్బడిగా తెలుగు సినిమాని ముంచెత్తగా, 'డిస్కో' కూడా అందులో చేరింది. ఇక షైనీ అనే హీరోయిన్ పాత్రలో సారా శర్మ ఎలా ఎంపికయ్యిందనేది అంతుచిక్కని ప్రశ్న. ఇటు గ్లామర్ పరంగా గానీ, అటు నటనా పరంగా గానీ ఆమెకి 100కి జీరో మార్కులే వస్తాయి. 'బిజినెస్ మేన్'లో మహేశ్ ని అనుకరిస్తూ ఎమ్మెస్ నారాయణ చేసిన సూర్యా భాయ్ కేరక్టర్ ఒక్కటే ఈ సినిమాలో మనకి రిలీఫ్ కలిగించే సంగతి. కనిపించింది రెండు నిమిషాలే అయినా ఈ సినిమాలో మనకి గుర్తుండేది అతడు చేసిన హాస్యమే. అలీ, రఘుబాబు ఫర్వాలేదనిపిస్తారు. కానీ ఎక్కువ కామెడీ సన్నివేశాలు చికాకు కలిగించాయంటే దానికి దర్శకత్వ లోపమే కారణం.
సన్నివేశాల్ని కల్పించడంలో హరి ఘోరంగా ఫెయిలయ్యాడు. ఇంటర్వెల్ రాకముందే జనం కుర్చీల్లో మహా ఇబ్బందిగా కదులుతున్నారంటేనే ఈ సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రి అంత పెద్ద డాన్ అయ్యుండీ చిటికెలో ఎలా మనసు మార్చుకుని మంచివాడవుతాడన్నది లాజిక్ కి ఏమాత్రం అందని విషయం. మొత్తానికి నిఖిల్ కెరీర్ లో మరో ఫ్లాప్ జమకూడినట్లే.
|