|

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న 'జులాయి' సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటల చిత్రీకరణ కోసం యూనిట్ ఈ నెల 26న దుబాయ్ కు వెళ్ళబోతోంది. అక్కడ రెండు పాటలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఇండియాలో బాలెన్స్ ఉండే రెండు పాటలను తీయడంతో సినిమా పూర్తవుతుంది. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చిన 'బద్రీనాథ్' కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి 'జులాయి' మీదనే ఉంది.
అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్. 'ఆర్య', 'బన్ని', 'ఆర్య-2' చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా 'జులాయి' సినిమాకూ దేవీనే సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందిన 'గబ్బర్ సింగ్' ఆడియో ఇటీవలే విడుదలై 'కెవ్వు కేక' పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో 'జులాయి'ఆడియో మీదా అంచనాలు పెరిగాయి. ఆడియోనూ త్వరలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను వేసవి కానుకగా మే నెలాఖరులో విడుదల చేస్తామని చిత్ర సమర్పకులు డీవీవీ దానయ్య తెలిపారు.
|