|
హీరోయిన్స్తో ఇంకా రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం బాగుండదని నటుడు అజిత్ అన్నారు. అజిత్ నటించిన బిల్లా-2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. పలు విశేషాలను సంతరించుకున్న ఈ చిత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర ఆడియో మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం తన వయసు 41 అని, ఇకపై హీరోయిన్లతో రొమాన్స్ సన్నివేశాలలో నటించడం అంత బాగుండదని అజిత్ పేర్కొన్నారు. తన భార్య శాలిని ధృడమైన మనస్తత్వం కలదని దంపతులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారో అలాంటి వాటినే తాము ఎదుర్కొన్నామని అజిత్ తెలిపారు.
బిల్లా-2 చిత్రం గురించి మాట్లాడుతూ... త్వరలో తెరపైకి రానున్న సినిమా గురించి వివరించడం సరికాదన్నారు. చూసిన తరువాత చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం పోరాట సన్నివేశాల్లో డూప్లేకుండా నటించిన అనుభవం గురించి అడుగుతున్నారని, నటుడిగా తన వృత్తి ధర్మాన్నే తాను నిర్వర్తించానని అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు యూనిట్ సభ్యులు తన గురించి తీసుకున్న జాగ్రత్తలు మరువలేనన్నారు.జర్మనీకి చెందిన ఫైట్ మాస్టర్ స్టీఫన్ రిచర్డ్కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్రాల ఎంపిక సమయంలో దర్శక, నిర్మాతలకు తనకు మధ్య సమన్వయం ముఖ్యం అన్నారు. స్క్రిప్ట్ను ఎంపిక చేయడం చాలా కష్టం అని చెప్పారు.
|