close
Choose your channels

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించిన 'క్లిక్ సినీ కార్ట్ మరియు జగపతి సినిమా బ్యానర్

Monday, April 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం చాలా మంది ద్రుష్టి సినిమా రంగం వైపు ఉంది. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ అభిరుచి, ఆసక్తి ఉన్నా.. అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో తెలియని స్థితి. ఈ రంగంలో కొత్త వారి కోసం సరైన వేదిక లేదనుకునే తరుణంలో సినిమా రంగంలో విశేష అనుభవం, అభిరుచి, అవగాహన ఉన్న నటుడు జగపతిబాబు, ఔత్సాహికుల కోసం 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా కొత్త వారు తన కలల్ని సాకారం చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ను సోమవారం హైదరాబాద్ లో దర్శకరత్న దాసరి నారాయణరావు లాంచ్ చేశారు. అలానే జగపతి ఆర్ట్స్ బ్యానర్ ను జగపతి సినిమా గా రీలాంచ్ చేశారు. ఈ సందర్భంగా..

దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''జగపతిబాబు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు బాగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్స్ కు ఇది చాలా అవసరం. కొత్తవాళ్ళు కావాలి.. కొత్తవారితో సినిమా చేయాలనుకునే వారికి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. నేను డైరెక్ట్ చేసిన స్వర్గం నరకం సినిమా కోసం సుమారుగా 1000 మంది కొత్తవారిని ఆడిషన్ చేసి 200 మందిని సెలెక్ట్ చేశాం. దాని కోసం వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, తిరుపతి ఇలా రకరకాల ప్రాంతాలకు తిరిగాము. కాని అలాంటి అవసరం లేకుండా జగపతి మంచి ఆలోచన చేశాడు. సినిమాలు తీయాలని, నటించాలని ఇండస్ట్రీకు వచ్చే వారు మోసపోతున్నారు. ఎవరికీ ఎలాంటి శ్రమ లేకుండా 'క్లిక్ సినీ కార్ట్' ను తన మనసులోంచి, పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాడు జగపతిబాబు. తను కాకుండా మరెవరైనా ఈ ఆలోచన చేస్తే ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. నిజాయితీ, పట్టుదల ఉన్న మనిషి. హీరోగా ఉండే తను ఇకపై హీరోగా వర్కవుట్ అవ్వదనే ఉద్దేశంతో విలన్ గా మారి ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అన్ని భాషల్లో తనను నటించమని అడుగుతున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఇటువంటి వారి వలనే ఇలాంటి పనులు సాధ్యమవుతాయి. ఈ వెబ్ సైట్ ను గ్లోబల్ గా తీసుకువెళ్లాలని వారి ఆలోచన. ఎలాంటి ఫీజ్ తీసుకోకుండా.. ఒక సెల్ఫీ తీసుకొని రిజిస్టర్ చేసుకుంటే ఈ వెబ్ సైట్ లో మెంబర్ కావచ్చు. అయితే తమ టాలెంట్ ను కూడా నిరూపించుకోవాలి. ప్రస్తుతం బొంబాయి, తమిళనాడు నుండి నటీనటులను తెచ్చుకుంటున్నారు. మనలోనూ చాలా మంది నటీనటులున్నారు. జగపతి బాబు చేస్తోన్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. జగపతి సినిమా బ్యానర్ పై రెండు కొత్త చిత్రాలను కొత్తవారితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందరు కొత్తవారు కాకపోయినా.. కనీసం యాభై నుండి అరవై శాతం వరకు కొత్తవారిని తీసుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కాని ఈ ఫంక్షన్ కు నాకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నాను. నేను పిలిచిన వెంటనే దాసరి గారు కాదనకుండా.. వచ్చారు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఇండస్ట్రీకు అవసరమని ఆయన భావించారు. 24 క్రాఫ్ట్స్, కౌన్సిల్ లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటువంటి పెద్ద మనిషి ఈ కార్యక్రమానికి రావాలనుకున్నాను. పది సంవత్సరాల వరకు ఈ వెబ్ సైట్ డెవలప్ మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రోపర్ ప్రొడ్యూసర్స్ లేకుండా పోయారు. సినిమా నిర్మాణంలోకి వచ్చే నిర్మాతలకు కూడా క్లిక్ సినీ కార్ట్ మార్గ దర్శకంగా నిలుస్తుంది. వి.బి.రాజేంద్రప్రసాద్ గారు నా తండ్రే అయినా ఇండస్ట్రీలోకి వచ్చి సుమారుగా ఎనిమిది నెలలు నేను స్ట్రగుల్ అయ్యాను. నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. బయట కూడా చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ.. కొందరు మోసగిస్తున్నారు. సరైన పోర్టల్ అనేది లేదు. దీనికోసం ఈ వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నాను. మనసు, హార్ట్ ఉంటే మంచి సినిమాలు తీయొచ్చు. సినిమా నిర్మాణం తరువాత కూడా దానికి సంబంధించిన వ్యాపారంలో, సినిమా ప్రచారంలో కూడా క్లిక్ సినీ కార్ట్ నిర్మాతకు అండగా నిలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే క్లిక్ సినీ కార్ట్... 'వన్ స్టాప్ షాప్'. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఆఫీస్ స్థాపించడానికి శ్రీధర్ బండారి, రమేష్ బండారిలు సహాయం చేస్తున్నారు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నేను ఎవరిని మోసం చేయలేదు. అక్రమంగా సంపాదించలేదు. తిన్నగానే సంపాదించాను. నాకు మీరు కావాలి.. సినిమా కావాలి.. డబ్బు కూడా కావాలి. మీ సెల్ఫీతో స్టార్ అయిపోవచ్చు. ప్రస్తుతం రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు.

జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ''సినిమాలు చేయడానికి ఈ వెబ్ సైట్ నౌకరి.కామ్ లాంటిది. ఇలాంటి కొత్త ఐడియాలు, ఇన్నోవేషన్స్ మరిన్ని రావాలి. ఇండస్ట్రీలో ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు.

హెచ్.టి.కుమారస్వామి మాట్లాడుతూ.. ''కొత్తవాళ్ళను ప్రోత్సహించాలని జగపతిబాబు తీసుకున్న నిర్ణయం అభినందదాయకం. ఆయన వెనుక ఉండి సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నాను'' అని చెప్పారు.

మురళీమోహన్ మాట్లాడుతూ.. ''సినిమాల్లోకి రావాలనుకునే వారికి ఇదొక బ్రిడ్జ్ లాంటిది. సినిమా ఎలా చేయాలో తెలియక చాలా మంది చేతులు కాల్చుకుంటున్నారు. కొత్త వారికోసం వెబ్ సైట్ ను పెట్టి మెయిన్ పోర్టల్ గా చేయడం అభినందించాల్సిన విషయం. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు జగపతి బాబు. సినిమా ఫ్లాప్ అయినా.. అలా చెప్పుకునే దమ్ము, ధైర్యం ఆయనకే ఉంది. తను చేస్తోన్న ప్రయత్నం సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.