close
Choose your channels

జీవితం అంటే అంతే..ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం. - పవన్ కళ్యాణ్

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్నియువ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ దాదాపు వంద కోట్ల‌కు పైగా బిజినెస్ చేసింది. భారీ అంచ‌నాలతో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ మూవీకి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూ మీకోసం....
పుస్త‌కాలు బాగా చ‌దువుతున్నారు క‌దా...ఇతిహాసాల్లో మీకు న‌చ్చిన పాత్ర ఏమిటి..?
ప‌రుశురాముడు అంటే ఇష్టం. ఆయ‌న నేను అనే అహంకారాన్ని చంపిన వ్య‌క్తి. నేను రామాయ‌ణ‌, మ‌హా భార‌తాల్ని ఒక క‌థ‌గా అనుకోను. అందులో ఏ విష‌యం ఉన్నా..అది నాకు అన్వ‌యించుకుంటా. ఓ ఘ‌ట్టంలో పైకి క‌నిపించే క‌థ వేరు. లోప‌ల పొర‌ల్లో దాగున్న భావం వేరు. ఆ భావం ఏమిటో వెతుకుతూ చ‌ద‌వ‌డం నాకిష్టం.
పుస్త‌కాలు మీలో కోపం, ఆవేశం పెంచాయా..? దూరం చేశాయా..?
నా ఆవేశం కోపం ఓ స‌మ‌స్య మీదే. నా క‌ళ్ల ముందు ఏదైనా త‌ప్పు జ‌రిగితే కోపం వ‌చ్చేస్తుంది. నా సినిమా ప్లాప్ అయ్యింద‌నో, అప్పుల పాలైయ్యాన‌నో నా చుట్టూ ఉన్న వాళ్ల‌పై కోపం తెచ్చుకోను. ప్ర‌జారాజ్యం పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయింది. అప్పుడేమీ ఆవేశ‌ప‌డ‌లేదు.
భారీగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు క‌దా..! మీరు అప్పులు పాల‌వ్వ‌డం ఏమిటి..?
నా కెరీర్ లో నాకొచ్చింది చేసుకుంటూ వెళ్లాను. డ‌బ్బులు గురించి ఆలోచించ‌లేదు. ఈ సినిమాకొచ్చిన డ‌బ్బులుతో ఓ ఇల్లు కొనాలి. ఓ స్థ‌లం కొనాలి. దాచుకోవాలి అని ఆలోచించ‌లేదు. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పిన‌వాళ్లు లేరు. నేను ఎంత సంపాదిస్తే అంతా ఖ‌ర్చు అయిపోయేది. నేనే కెరీర్ లో చేసింది 20 సినిమాలే. నాకు పెద్ద‌గా డ‌బ్బులుతో అవ‌స‌రం లేదు. అయితే...నా చుట్టూ చాలా మంది ఉంటారు ఖ‌ర్చులుంటాయి. నేనెక్క‌డికీ ఒంట‌రిగా వెళ్ల‌లేను సెక్యూరిటీ కావాలి. అలాంటి క‌నిపించ‌ని ఖ‌ర్చులు ఉంటాయి. అవ‌న్నీ త‌డిసి మోపెడ‌య్యేవి. మ‌నీ మేనేజ్ మెంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా లేను.
స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కి 35 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నార‌ట నిజ‌మేనా..?
అది నిజం కాదు. అంత తీసుకోలేదు.
తెలుగులో అత్య‌ధిక పారితోషికం తీసుకున్న హీరో మీరే అంటున్నారు..!
అవును..హ‌య్య‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాను. ట్యాక్స్ వాళ్ల‌న‌డిగితే చెబుతారు.
ఇంత‌కీ మీరు ఎంత రిచ్..ఎంత ఫూర్..?
ఇన్ క‌మ్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ చూస్తే 20 కోట్లు డెఫ్సిట్.
మ‌రి..సినిమాల్లో న‌టించ‌డం మానేస్తే ఎలా..? ఫ్యాన్స్, ప్రేక్ష‌కులేమ‌వుతారు..?
ఖుషి టైమ్ లోనే రెండు మూడు సినిమాలు చేసి మానేద్దామ‌నుకున్నా. కానీ..కుద‌ర‌లేదు. ఇప్పుడిక పూర్తిగా రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నా. భార్యాబిడ్డ‌ల జీవితం గ‌డ‌ప‌డానికి కావాల్సిన కొద్ది డ‌బ్బు సంపాదించి సినిమాలు మానేస్తా. రాజ‌కీయాల్లో నేను నాలా ఉండ‌చ్చు. సినిమాల్లో అలా కుద‌ర‌దు.
భార్యాబిడ్డ‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది కాబ‌ట్టి అడుతున్నా...శ్రీశైలం అడ‌వుల్లోకి పారిపోదాం అనుకున్నారు క‌దా..అలా చేసుంటే బ్ర‌హ్మ‌చారిగానే ఉండిపోయేవారేమో..కానీ...అలా జ‌ర‌గ‌కుండా ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు దీని గురించి ఏమంటారు..?
మా అమ్మ ఇదే అంటుంటుంది. ఓరేయ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండిపోదామ‌నుకున్నావ్. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్ అని ఆరోజులును గుర్తు చేస్తుంటుంది. జీవితం అంటే అంతే..ఎప్పుడు ఎన్ని మ‌లుపులు తీసుకుంటుందో చెప్ప‌లేం. ఎలిజిబెత్ టేల‌ర్ అన్ని పెళ్లిళ్లు చేసుకుంది అంటే అలా ఎలా చేసుకుంటారో అనుకునేవాణ్ని. నా జీవితం అలానే అయ్యింది.
మీ అబ్బాయి అకిరా స‌ర్ధార్ సినిమా చూసాడా..? ఏమ‌న్నాడు..?
అకిరా స‌ర్ధార్ సినిమా చూడ‌లేదు. నేను కూడా వాళ్ల‌ను చూసి నాలుగు నెల‌లైంది. ఈ సినిమా బిజీలో ప‌డి వెళ్ల‌లేదు. పిల్ల‌లు బెంగ ప‌డుతున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజునే వాడి పుట్టిన‌రోజు కూడా. మ‌ర్చిపోయాను. సాయంత్రం గుర్తొచ్చి ఫోన్ చేసి సారీ చెప్పాను. ఈరోజో రేపో పుణే వెళ్లి చూసొస్తా.
స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఆగ‌డు, కిక్ 2 చిత్రాల‌తో పోలుస్తూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి మీరేమంటారు..?
తొలిప్రేమ సినిమా చేసిన‌ప్పుడు కూడా పనికి మాలిన ఆక‌తాయిల క‌థ అని విమ‌ర్శకులు చీల్చి చెండాడారు. కానీ..బ్లాక్ బ‌ష్ట‌ర్. ఈరోజుకీ చెప్పుకుంటున్నారు. అంద‌ర్నీ తృప్తిప‌ర‌చ‌డ‌మ‌నేది అసాధ్యం. ఏమైనా ప్ర‌శంస‌ల్లానే విమ‌ర్శ‌ల్నీ తీసుకోవాలి. ఎవ‌రి అభిప్రాయం వాళ్ల‌ది. మెచ్చుకొనే వాళ్లూ తిట్టేవాళ్లూ ఇద్ద‌రూ నాకు స‌మానం.
బాహుబ‌లి తెలుగు సినిమాని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరిస్తే...స‌ర్ధార్ మ‌ళ్లీ కింద‌కు తీసుకుపోయింద‌న్న‌ట్లు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేసారు..
చూడ‌లేదండీ! వీళ్లంతా ప్రిడిక్ట‌బుల్ పీపుల్.
వ‌ర్మ‌తో మీకు ఏమైనా తేడా పాడాలున్నాయా..?
అప్ప‌ట్లో ఆయ‌న వైఫ్ ఆఫ్ వ‌ర‌ప్ర‌సాద్ క‌థ చెప్పారు. ఆ సినిమా నేను చేయ‌లేదు అంతే. అయినా ఆయ‌న విచిత్ర‌మైన వ్య‌క్తి. న‌న్న‌డిగితే..ఆయ‌న బ‌య‌ట‌వాళ్ల మీద పెట్టే శ్ర‌ద్ద త‌న‌పై త‌న సినిమాల‌పై పెడితే వేరే స్ధాయికి వెళ్లేవారు.
ఎవ‌రైనా కామెంట్ చేస్తుంటే ఏమ‌నిపిస్తుంటుంది..?
సినిమా గురించైనా, పాలిటిక్స్ గురించైనా కామెంట్ చేయ‌డం చాలా తేలిక. కానీ పాలిటిక్స్ లోకి వ‌చ్చి జ‌నం ముందు మాట్లాడ్తే తెలుస్తుంది. అంతెందుకు ఆయ‌న్ని(వ‌ర్మ‌) సెక్యూర్టీ లేకుండా విజ‌య‌వాడలో నుంచి వెళ్ల‌మ‌నండి. కుద‌ర‌దు. ఏమైనా క్రిటిక్స్ చేయాల్సిన ప‌ని వేరు. ఫిల్మ్ మేక‌ర్ చేయాల్సిన ప‌ని వేరు. ఆయ‌న తోటి ఫిల్మ్ మేక‌ర్ అనుకుంటాను. కాదంటే నాకూ లోప‌ల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ర్కిప్ట్ చేసి మాట్లాడ‌గ‌ల‌ను.
స‌ర్ధార్ లో గుర్ర‌పు స్వారీ చేసారు..ఎప్పుడు..ఎక్క‌డ నేర్చుకున్నారు..?
నిజం చెప్పాలంటే...నాకు గుర్ర‌పుస్వారీ రాదు. ఎప్పుడూ..ఎక్క‌డా నేర్చుకోలేదు. గ‌బ్బ‌ర్ సింగ్ టైమ్ లో ఫస్ట్ టైమ్ గుర్ర‌పుస్వారీ చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు కింద‌ప‌డితే..త‌ల ప‌గిలితే.. ఏమిటి ప‌రిస్థితి అని భ‌యం వేసింది. అప్పుడు నేను గుర్రం ద‌గ్గ‌ర‌కెళ్లి దానితో మాట్లాడాను. నేను చెప్పింది గుర్రానికి ఏం అర్ధ‌మైందో ఏమో కానీ...గుర్రం స‌హ‌క‌రించింది. గుర్రం పైకి ఎక్కి కూర్చున్నాక ప‌ట్టు దొరికింది అంతే. ఇక అప్ప‌టి నుంచి అల‌వాటైపోయింది. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం వేసిన ర‌త‌న్ ఫూర్ సెట్ లో అటు ఇటు తిర‌గ‌డానికి గుర్రమే వాడాను. అన్న‌య్య‌(చిరంజీవి)కి గుర్ర‌పుస్వారీ బాగా వ‌చ్చు. నేను బాగా వ‌చ్చిన‌ట్లు న‌టించాను.(న‌వ్వుతూ..)
స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఎండ్ టైటిల్స్ లో రాజా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కంటిన్యూస్ అన్నారు...చేస్తారా..?
అవునండీ.. రాజా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తాం.
మొత్తానికి గ‌బ్బ‌ర్ సింగ్ ని బ్రాండ్ గా మారుస్తున్న‌ట్లున్నారు..?
బ్రాండ్ కాదు కానీ..ఎంట‌ర్ టైన‌ర్స్ తీద్దామ‌ని!
అస‌లు గ‌బ్బ‌ర్ సింగ్ ఆలోచ‌న మీదేనా..?
హైద‌రాబాద్లో కె.ఎస్.ఎన్ మూర్తి గార‌ని పోలీస్ ఆఫీస‌ర్ ఉండేవారు. ఆయ‌న్ని గ‌బ్బ‌ర్ సింగ్ అని పిలిచేవారు. ఆ స్పూర్తితో నేను గ‌బ్బ‌ర్ సింగ్ అనే టైటిల్ పెట్టుకుని హిందీ ద‌బంగ్ బేసిక్ ప్లాట్ తీసుకొని క‌థ‌, అంత్యాక్ష‌రి సీన్స్ లాంటివ‌న్నీ వ‌ర్క్ చేశా. ఫోటో షూట్ చేశాక‌, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ను పిలిచి సినిమా అప్ప‌గించాను. అలా గ‌బ్బ‌ర్ సింగ్ వ‌చ్చింది.
ఖుషీలో హిందీ పాట పెట్టారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో హిందీ పాట పెట్టారు. హిందీ పాట‌లంటే అంత మ‌క్కువ ఎందుకు..?
నాకు ప్ర‌తి భాషా ఇష్ట‌మే. రెండు సంస్కృతుల్ని క‌లిపే శ‌క్తి క‌ళ‌కు ఉంది. క‌ళాకారుల వ్య‌క్తిగ‌త బాధ్య‌త అది. హిందీ ప‌రాయి భాష కాదు. అది మ‌న జాతీయ భాష‌. అలాంట‌ప్పుడు ఎందుకు సినిమాల్లో ట‌చ్ చేయ‌కూడ‌దు అనిపించింది. నాకు జాన‌ప‌ద గీతాల‌న్నా ఇష్టం. నా చిన్న‌ప్పుడు నాన్న ఇంట్లో అలాంటి పాట‌లు వింటూ ఉండేవారు. న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న‌ప్పుడు శ్రీకాకుళం జిల్లా వాళ్లు ప‌రిచ‌య‌మ‌య్యారు. వాళ్ల బాణీ నాకు న‌చ్చింది. ఏదైనా పాట బాగుంటే వీలు కుదిరిన‌ప్పుడు సినిమాల ద్వారా గుర్తు చేయ‌డం మ‌న బాధ్య‌త‌. ఆ క‌ళ ఉనికిని కాపాడిన‌వాళ్లం అవుతాం.
స‌ర్ధార్ రిజ‌ల్ట్ గురించి ఏమంటారు..?
అంద‌రూ బాగుంది అంటున్నారు. నేనూ హ్యాఫీనే. మేం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్ట‌ప‌డ్డాం. ఫ‌లితం చెప్పాల్సింది ప్రేక్ష‌కులే.
దాస‌రి నిర్మాణంలో సినిమా ఎప్పుడు..?
దాస‌రి అంటే నాకు గౌర‌వం. తెలుగు సినిమాకి ఎంతో చేసారు. అలాంటి వ్య‌క్తితో సినిమా అంటే నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. మంచి క‌థ దొర‌కాలి. ఆయ‌న ఎప్పుడు తీసుకువ‌స్తే అప్పుడు చేస్తా.
త‌దుప‌రి చిత్రం ఎప్పుడు..?
త్వ‌ర‌లోనే..! ఎస్.జె సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది.
ఖుషి కి సీక్వెలా..?
కాదు. ఇది వేరే క‌థ‌. ఫ్యాక్ష‌నిస్ట్ ల‌వ్ స్టోరీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.