close
Choose your channels

'శరణం గచ్చామి' ఆడియో విడుదల

Sunday, March 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం "శరణం గచ్చామి". రిజర్వేషన్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయడం పట్ల దర్శకుడు ప్రేమ్ రాజ్ పోరాడి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ ఆడియో విడుదల వేడుక భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
మంత్రి కేటీయార్ "శరణం గచ్చామి" ఆడియో సీడీలను విడుదల చేసిన చిత్ర బృందానికి అందించారు.

ఈ సందర్భంగా కేటీయార్ మాట్లాడుతూ.. "తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నిరాశతో ముందడుగు వేయలేకపోతున్న మా తెలంగాణ వాదులందరికీ తన సాహిత్యంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి దర్శకుడు ప్రేమ్ రాజ్. నాతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎప్పుడు నా సహాయం తీసుకోలేదు. అటువంటి వ్యక్తి ఒక మంచి ఆశయంతో తెరకెక్కించిన "శరణం గచ్చామి" చిత్రానికి ఆయన అడగకున్నా ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల అండదండలూ, మద్దతు నేను అందిస్తాను. ట్యాక్స్, సబ్సిడీ వంటి విషయాల్లో నేను పర్సనల్ కేర్ తీసుకొంటాను. ఈ సినిమా మంచి విజయం సాధించి ఇలాంటి మరిన్ని చిత్రాలు రూపొందడానికి ఊతమివ్వాలని ఆశిస్తున్నాను" అన్నారు.

దర్శకుడు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ.. "స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా నా దళిత సోదరసోదరీమణులు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక తెరకెక్కించిన చిత్రమిది. దళితుల గుండె చప్పుడు ఈ చిత్రం. నన్ను నమ్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత మురళీ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను" అన్నారు.

చిత్ర నిర్మాత మరియు కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన మురళి బొమ్మకు మాట్లాడుతూ.. "రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నేను సినిమా మీద అభిమానంతోనే కాక సమాజానికి ఉపయోగపడే చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆశయంతో నిర్మాతగా మారాను. దళితులు కాదు అన్ని వర్గాల వారు రిజర్వేషన్ కారణంగా పడుతున్న ఇబ్బందులను గూర్చి ఈ చిత్రంలో ప్రస్తావించడం జరిగింది. సెన్సార్ సభ్యులు బ్యాన్ చేసిన మా ఈ సినిమాకి కేటీయార్ గారు సపోర్ట్ చేయడం మాకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది" అన్నారు.

నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ, దేశపతి శ్రీనివాస్, సుబ్బారాయశర్మ, మరియు బి.సి.సంఘ నాయకులు-శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సామి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం: రవి కళ్యాణ్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ-జర్నలిస్ట్ సతీష్ చంద్ర, సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి, స్టోరీ-స్క్రీన్ ప్లే- ప్రొడ్యూసర్: బొమ్మకు మురళి, డైలాగ్స్ & డైరెక్షన్: ప్రేమ్ రాజ్ !!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.