close
Choose your channels

2000 Rupees:రూ.2000 నోట్ల ఉపసంహరణ : మార్పిడి ఎలా, రుసుము చెల్లించాలా .. మీ మైండ్‌లోని డౌట్స్‌కి ఆన్సర్స్ ఇవే..?

Saturday, May 20, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రూ. 2000 నోట్లను చెలమణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెప్టెంబర్ 30 లోగా ప్రజలు తమ వద్ద వున్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. దేశవ్యాప్తంగా వున్న 19 ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లోనూ నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. అయితే ఆకస్మాత్తుగా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది.. అసలు క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి..? ఇలా ప్రజల మనసుల్లో రకరకాల ఆలోచనలు. ఈ నేపథ్యంలో వీటన్నింటికి ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానాలు ఏంటంటే..?

1. రూ.2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు...

రూ.2000 నోటు నవంబర్ 2016లో ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం అన్ని 500 , 1000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కోసం, దేశ ప్రజల కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో పాటు ఇతర డినామినేషన్లలో (రూ.500, రూ.200, రూ.100, రూ.50 , రూ.20, రూ 10) తగిన పరిమాణంలో అందుబాటులోకి రావడంతో, 2018-19లో 2000 నోట్ల ముద్రణ నిలిపివేశారు. రూ.2000 నోట్లలో ఎక్కువ భాగం మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి. వాటి జీవితకాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా . ఈ నోటు సాధారణంగా లావాదేవీలకు ఉపయోగించబడదని ఆర్బీఐ అంచనాకు వచ్చింది. దీనితో పాటు ఇతర డినామినేషన్లలోని నోట్లు ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా వున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో వుంచుకోవడంతో పాటు “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం ₹2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.

2. క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి?

క్లీన్ నోట్ పాలసీ అంటే ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో వుంచేందుకు ఆర్‌బీఐ అనుసరించే విధానం

3. 2000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితి అలాగే ఉంటుందా ?

అవును, 2000 నోటు దాని చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఆర్‌బీఐ కొనసాగిస్తుంది.

4. సాధారణ లావాదేవీలకు 2000 నోట్లను ఉపయోగించవచ్చా?

అవును.. ప్రజలు తమ లావాదేవీల కోసం రూ.2000 నోట్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. వాటిని చెల్లింపులకు వినియోగించవచ్చు. అయితే ఈ నోట్లను సెప్టెంబర్ 30, 2023 లోగా డిపాజిట్‌ చేసుకోవడమో, మార్పిడి చేసుకోవడమే చేయాలి.

5. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఏమి చేయాలి?

ప్రజలు తమ వద్ద ఇప్పటికే వున్న రూ.2000 నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి కోసం బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు. సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఈ సదుపాయం అందుబాటులో వుంటుంది. అలాగే దేశంలో వున్న 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ రూ.2000 నోటును మార్చుకోవచ్చు.

6. బ్యాంకు ఖాతాలో 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి పరిమితి ఉందా?

బ్యాంక్ ఖాతాలలో రూ.2000 నోటును డిపాజిట్ చేయడం అనేది ప్రస్తుతం అమల్లో వున్న కేవైసీ నిబంధనలు, ఇతర చట్టపరమైన నిబంధనల ఆధారంగా చేసుకోవచ్చు.

7. ఒక వ్యక్తి ఎన్ని రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు..?

ఒక వ్యక్తి తన వద్ద వున్న రూ.2000 నోట్లను పది వరకు ఒకేసారి మార్చుకోవచ్చు. అంటే రోజుకు రూ.20000 అన్నమాట.

8. 2000 నోట్లను బిజినెస్ కరస్పాండెంట్ల (BCలు) ద్వారా మార్చుకోవచ్చా?

అవును, ఒక ఖాతాదారునికి రోజుకు 4000/- పరిమితి వరకు BCల ద్వారా ₹2000 నోట్ల మార్పిడిని చేయవచ్చు.

9. రూ.2000 నోట్ల మార్పిడి సౌకర్యం ఏ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది?

రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం సన్నాహక ఏర్పాట్లను చేయడానికి బ్యాంకులకు సమయం ఇవ్వడానికి వీలుగా.. మే 23, 2023 నుండి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, బ్యాంక్‌లను సంప్రదించవలసిందిగా ఆర్బీఐ కోరింది.

10. బ్యాంక్‌లో ఖాతా లేని వ్యక్తి రూ.2000 నోట్లను మార్చుకోవడం ఎలా..?

ఖాతా లేని వ్యక్తి కూడా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి 20,000/- పరిమితి వరకు 2000 నోట్లను మార్చుకోవచ్చు.

11. వ్యాపారం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఎవరికైనా 20,000/- కంటే ఎక్కువ నగదు అవసరమైతే?

ఎలాంటి పరిమితులు లేకుండా ఖాతాల్లో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ల నుంచి నగదు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు.

12. రూ.2000 నోటు మార్పిడి సౌకర్యం కోసం ఏదైనా రుసుము చెల్లించాలా?

అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్ల మార్పిడి సౌకర్యంగా ఉచితంగా అందిస్తారు.

13. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు తదితరులకు మార్పిడి , డిపాజిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా?

2000 నోట్లను మార్చుకోవడానికి/ డిపాజిట్ చేయడానికి సీనియర్ సిటిజన్లు, వికలాంగులు తదితరులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించబడింది.

14. బ్యాంకు 2000 నోటును మార్చుకోవడానికి / డిపాజిట్‌ చేసుకోవడానికి నిరాకరిస్తే..?

మొత్తం ప్రక్రియను సాఫీగా, సౌకర్యవంతంగా జరగడానికి 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి నాలుగు నెలలకు పైగా సమయం అందుబాటులో వుంది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, నిర్ణీత సమయంలో వారి సౌలభ్యం మేరకు ఈ సదుపాయాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేశాం.

బ్యాంక్‌లు అందించే సేవలో లోపం ఉన్నట్లయితే ఫిర్యాదుల పరిష్కారం కోసం, ఫిర్యాదుదారు ముందుగా సంబంధిత బ్యాంకును సంప్రదించవచ్చు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి 30 రోజుల వ్యవధిలో బ్యాంకు స్పందించకుంటే లేదా బ్యాంక్ ఇచ్చిన స్పందన/రిజల్యూషన్‌తో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే, రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB) కింద cms.rbi.org.in పోర్టల్‌లో ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.