Download App

2016 బెస్ట్ ఎంటర్ టైనర్స్

2016 బెస్ట్ ఎంటర్ టైనర్స్

2016..నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అప్పుడే కాలం కరిగిపోయింది. సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం 2017 వచ్చేస్తుంది.ఈ సందర్భంగా 2016లో వచ్చిన తెలుగు సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే...వైవిధ్యమైన కథా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు...ఇలా అన్నిరకాల చిత్రాలు మరచిపోలేని అనుభూతిని అందించాయి. వీటితో పాటు అంచనాలను అందుకోలేక ఘోరంగా ఫెయిలైన భారీ చిత్రాలు ఉన్నాయి. కంటెంట్ ఉంటే చాలు...చిన్న హీరో సినిమా అయినా సరే... ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమా చూస్తారు అని మరోసారి నిరూపించిన చిత్రాలు వచ్చాయి. టోటల్ గా 2016 తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అయితే...ఈ సంవత్సరంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బెస్ట్ ఎంటర్ టైనర్స్ గా నిలిచిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం..!

నేను శైలజ

ఈ సంవత్సరం వచ్చిన చిత్రాల్లో ముందుగా చెప్పుకోవలసింది నేను శైలజ. రామ్ - కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెకండ్ హ్యాండ్ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన నేను శైలజ చిత్రం ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ద్వారా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయమైంది. రామ్, కీర్తి సురేష్ ల నటన, దేవిశ్రీ మ్యూజిక్, సత్యరాజ్ పర్ ఫార్మాన్స్...ఇలా అన్నిఅంశాలు ఆడియోన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. రామ్ కెరీర్ కి అవసరమైన మంచి హిట్ ను ఇచ్చి 2016లో తొలి విజయాన్ని అందించింది నేను శైలజ.

కిల్లింగ్ వీరప్పన్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్. గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివరాజ్ కుమార్ పోలీసాఫీసర్ గా నటించగా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషించారు. వీరప్పన్ లైఫ్ స్టోరీ పై వర్మ సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథకు కరెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకోవడం, పాత్రకు తగ్గట్టు వాళ్లు నటించడం దీనికి తోడు వర్మ టేకింగ్ అదరగొట్టడంతో సినిమా సక్సెస్ అయ్యింది. అయితే... మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో వర్మ నుంచి వచ్చిన బెస్ట్ మూవీగా వీరప్పన్ ఆకట్టుకుంది.

నాన్నకు ప్రేమతో...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో.. ఎన్టీఆర్ 25వ చిత్రం కావడంతో నాన్నకు ప్రేమతో పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో...రిలీజైంది. కథ విషయానికి వస్తే...తండ్రి కోరిక నెరవేర్చడం కోసం కొడుకు ఏం చేసాడనే విభిన్న కథా చిత్రమిది. సుకుమార్ తనదైన శైలిలో ఇంట్రస్టింగ్ & ఇంటిలిజెన్స్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఎన్టీఆర్ గెటప్ & పర్ ఫార్మెన్స్, రకుల్ గ్లామర్, దేవిశ్రీ మ్యూజిక్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ల పర్ ఫార్మెన్స్...టోటల్ గా నాన్నకు ప్రేమతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా 50 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్లు షేర్ సాధించిన తొలి చిత్రంగా నాన్నకు ప్రేమతో సరికొత్త రికార్డ్ సాధించింది.

సోగ్గాడే చిన్ని నాయనా

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా రూపొందిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడడం.. దీనికి తోడు చాలా గ్యాప్ తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించడం ఆడియోన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే చాలా రోజుల తర్వాత పల్లెటూరి నేపధ్యంతో మూవీ రావడంతో సంక్రాంతి పండగకి కరెక్ట్ మూవీ ఇదే అని ఫీలై ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. మూడు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ సోగ్గాడు రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. 53 కోట్లకు పైగా షేర్ సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక సీనియర్ హీరోగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో చరిత్ర సృష్టించారు.

ఎక్స్ ప్రెస్ రాజా

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సూపర్ హిట్స్ తరువాత యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్ తరువాత మేర్లపాక గాంధీ కలయికలో రూపొందిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. శర్వనంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సరికొత్త స్ర్కీన్ ప్లే, దీనికి తోడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కథను గాంధీ నడిపించిన విధానం బాగుంది.సంక్రాంతి పోటీలో భారీ చిత్రాల మధ్య రిలీజైన ఈ చిన్న సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆదరణ పొందింది. ఈ కామెడీ ఎక్స్ ప్రెస్ విజయం సాధించి శర్వనంద్ కెరీర్ లో హ్యాట్రిక్ ని అందించింది.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ

నేచేరల్ స్టార్ నాని, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్న ప్రేమకథ కావడం...దీనికి తోడు ఎంటర్ టైన్మెంట్ & ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు ఉండడంతో ఆడియోన్స్ ను ఆకట్టుకుంది. భలే భలే మగాడివోయ్ తర్వాత నాని సినిమా అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండడంతో విజయం సాధించి నాని ఇమేజ్ ను మరింత పెంచింది కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం.

క్షణం

చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన చిత్రం క్షణం. అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ, రాజేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రాన్ని నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ చిత్రాన్ని నడిపించిన విధానం బాగుండడం, ఒక కొత్త రకమైన సినిమా కావడంతో ఆడియోన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్, సత్యదేవ్ లకు సక్సెస్ అందించింది ఈ సినిమా. అడవి శేష్ హీరోగా నటించడంతో పాటు ఈ మూవీకి కథను కూడా అందించి... రైటర్ గాను, హీరోగాను ఓకే సినిమాతో సక్సెస్ సాధించాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆడియోన్స్ ఆదరిస్తారు అని నిరూపించింది క్షణం.

ఊపిరి

టాలీవుడ్ కింగ్, కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెంచ్ లో క్లాసిక్ అనిపించుకున్న ఇన్ టచ్ బుల్స్ మూవీ ఆధారంగా ఊపిరి చిత్రాన్ని రూపొందించారు. ప్రయోగాల సర్ధార్ కింగ్ నాగార్జున నుంచి వచ్చిన మరో విభిన్న కథా చిత్రమిది. నాగార్జున వీల్ ఛైర్ కే పరిమితమైన క్యారెక్టర్ అంటే సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ...అందరి అంచనాలను తారుమారు చేస్తూ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఊపిరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఊపిరి తెలుగు సినిమాకి కొత్త ఊపిరి ఇచ్చింది.

సుప్రీమ్

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రవిపూడి కాంబినేషన్లో రూపొందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా నటించింది. బెల్లం శ్రీదేవి పాత్రలో రాశీఖన్నా పోలీస్ క్యారెక్టర్ లో నవ్వించింది. ఇక సాయిధరమ్ తేజ్ అయితే తనదైన శైలిలో నటించి మాస్ ని మెప్పించాడు. కమర్షియల్ మూవీ అంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ మిక్స్ చేసి అనిల్ రవిపూడి అందించిన ఎంటర్ టైనర్ ఇది. పటాస్ లో పృధ్వీరాజ్, ప్రభాస్ శీను లా ఇందులో పోసాని, శ్రీనివాసరెడ్డి చేసిన కామెడీ బాగా నవ్వించింది. దీనికి తోడు సాంగ్స్, ఫైట్స్ మాస్ ని బాగా మెప్పించాయి. టోటల్ గా అనిల్ రవిపూడి పటాస్ తర్వాత సుప్రీమ్ తో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

సరైనోడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉండాలో బోయపాటికి బాగా తెలుసు. అందుకనే మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించి అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి మాస్ హీరో చేసాడు బోయపాటి.ఈ సినిమా ద్వారా బోయపాటి ఆది పినిశెట్టిని విలన్ గా పరిచయం చేసారు. బన్ని, ఆది పినిశెట్టి నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ మూవీకి ముందుగా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఊహించని విధంగా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసి సరైనోడు బ్లాక్ బష్టర్ గా నిలవడం విశేషం.

అ ఆ

నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అ ఆ. అనుబంధం, ఆత్మీయత, ప్రేమ తదితర అంశాలతో త్రివిక్రమ్ రూపొందించిన అందమైన ప్రేమకథగా అ ఆ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రం అన్ సీజన్ లో రిలీజైన అంచనాలకు మించి రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో రికార్డ్ స్ధాయిలో $ 2.45 మిలియన్ డాలర్స్ వసూలు చేసి నితిన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

జెంటిల్ మన్

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన చిత్రం జెంటిల్ మన్. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ కొత్తరకమైన సస్పెన్స్ థ్రిల్లర్ ని ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ద్వారా మలయాళ బ్యూటీ నివేథా థామస్ ని హీరోయిన్ గా పరిచయం చేసారు. తొలి చిత్రంతోనే నివేథా ఆకట్టుకుని టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అష్టాచమ్మా కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం బిగినింగ్ నుంచి ఆడియోన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. దీనికి తోడు డిపరెంట్ స్టోరీ కావడం, ఇంటర్వెల్ లో సస్పెన్స్, క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగా కనెక్ట్ కావడంతో ప్రేక్షకాదరణ పొంది జెంటిల్ మన్ నాని కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది.

పెళ్లి చూపులు

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్నిసొంతం చేసుకున్న సంచలన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి ఈ చిత్రాన్నినిర్మించారు. ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలు మాత్రమే ఆడుతున్న ఈరోజుల్లో ఓ చిన్న చిత్రం సక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడడం అంటే ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పెళ్లిచూపులు చిత్రం ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. రెగ్యులర్ చిత్రాలా కాకుండా ఈ మూవీని తెరకెక్కించిన విధానమే కొత్తగా ఉండడంతో ఇండస్ట్రీ ప్రముఖులను సైతం మెప్పించింది పెళ్లి చూపులు.

జనతా గ్యారేజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ ఊహించని విధంగా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పర్యావరణాన్ని కాపాడాలనే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండడం...మోహన్ లాల్, ఎన్టీఆర్ ల నటన, దేవిశ్రీ సంగీతం, కొరటాల టేకింగ్...ఇలా అన్ని కలిసి జనతా గ్యారేజ్ కి సంచలన విజయాన్ని అందించాయి. దాదాపు 80 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా జనతా గ్యారేజ్ సంచలనం సృష్టించింది.

జ్యో అచ్యుతానంద

నారా రోహిత్ - నాగశౌర్య, రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం జ్యో అచ్యుతానంద. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అన్నదమ్ములైన ఈ ఇద్దరు తమ ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయితో ప్రేమలో పడడం...ఆ అమ్మాయి నో చెప్పడం మామూలే. అయితే...పెళ్లైనప్పటికీ ప్రేమలో పడడం...ఆతర్వాత వీరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సింపుల్ స్టోరీని ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించడంలో అవసరాల సక్సెస్ అయ్యాడు. టైటిల్ దగ్గర నుంచి వెరైటీగా అనిపించిన జ్యో అచ్యుతానంద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ప్రేమమ్

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమమ్. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రం తెలుగులో ఎలా ఉంటుందో అనుకున్నప్పటికీ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్ లో అద్భుతంగా నటించి నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సబాస్టియన్ నటించారు. సన్నివేశానికి తగ్గట్టు సంభాషణలు, మాస్ కి, యూత్ కి నచ్చే సీన్స్ తో ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించడంలో చందు మొండేటి సక్సెస్ అయ్యాడు. ప్రేమమ్ దాదాపు 25 కోట్లు షేర్ సాధించి నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా

స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య...ఇలా వైవిధ్యమైన కథాంశాలతో విజయం సాధించి యూత్లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరో నిఖిల్. టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్ జంటగా రూపొందిన చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ రాబట్టి నిఖిల్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండాఫ్ టేకింగ్, నిఖిల్, నందిత శ్వేతాల నటన, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి ఊహించని విధంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్ సాధించింది.

జయమ్ము నిశ్చయమ్మురా

కమెడియన్ టర్నడ్ హీరో శ్రీనివాసరెడ్డి నటించిన తాజా చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించారు. శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశవాళి ఎంటర్ టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి చేసిన ప్రయత్నానికి ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సినీ విమర్శకుల ప్రశంలు లభించాయి.

ధృవ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధృవ. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్ లో ఘన విజయం సాధించిన తని ఓరువన్ మూవీకి రీమేక్ గా రూపొందిన ధృవ చిత్రం ఆడియోన్స్ ను ఆకట్టుకోవడం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ గెటప్ & యాక్షన్, అరవింద్ స్వామి స్టైలీష్ విలనిజం, సురేందర్ రెడ్డి టేకింగ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవర్ సీస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకుని చరణ్ కెరీర్ లో1 మిలియన్ మార్క్ సాధించిన తొలి చిత్రంగా ధృవ రికార్డ్ క్రియేట్ చేసింది.