తెలంగాణలో గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

  • IndiaGlitz, [Friday,November 13 2020]

ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సారయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్య ‌కు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చేలా పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పనిచేసిన కవి.. కళాకారుడిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జానపద కవి.. గాయకుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. పాలమూరు జిల్లాకు చెందిన వెంకన్న తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్య పరిచారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా పార్టీలకు అతీతంగా కళామతల్లికి సేవలందిస్తున్నారు. దీంతో కేసీఆర్ దృష్టి గోరేటి వెంకన్నపై పడినట్టు తెలుస్తోంది.