ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 32 మంది కరోనాతో మరణించినట్టు కేంద్ర వైద్య అరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఇప్పటి వరకూ మొత్తం మరణించిన వారి సంఖ్య 170కి చేరుకుంది. మరోవైపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు 773 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,494కు పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియా మీట్‌లో వెల్లడించారు. 472 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.

మరణాల సంఖ్య తక్కువే..

‘ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సంక్రమించకుండా నియంత్రణ చర్యలు చేపట్టాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. వైరస్ కట్టడికి ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరిక్విన్ నిల్వలు చాలినన్ని ఉన్నాయి. కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో 80 శాతం మంది ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.