33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

  • IndiaGlitz, [Monday,November 23 2020]

మావోయిస్టు పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులై వారికి సహకరిస్తున్న మిలీషియా సభ్యులు వారి సిద్ధాంతాల పట్ల విరక్తితో సోమవారం కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. ఒకరు కాదు.. ఇద్దరు మొత్తంగా 33 మంది ఎస్పీ ఎదుట లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సునీల్ దత్ మిలీషియా సభ్యుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ చర్ల మండలం బత్తినపల్లి, కిష్టారంపాడు గ్రామాలకు చెందిన 33 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయినట్టు ఎస్పీ వెల్లడించారు.

లొంగిపోయిన వారంతా మావోయిస్టు మిలీషియా, గ్రామ కమిటీ సభ్యులుగా పని చేశారని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. కాగా.. వీరిలో కొందరు పెద్దమిడిసిలేరు రోడ్డు బ్లాస్టింగ్, కలివేరు మందు పాతరలను అమర్చిన ఘటనతో పాటు తిప్పాపురం వద్ద రోడ్డు రోలర్, జేసీబీలను తగులబెట్టిన ఘటనల్లో పాల్గొన్నారని ఎస్పీ వెల్లడించారు. వీరంతా మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో పని చేసినట్టు ఎస్పీ తెలిపారు. రెండేళ్లుగా వీరు పార్టీ కోసం పని చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీసులు చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలతో స్ఫూర్తి చెందిన వీరు జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఎస్పీ తెలిపారు.