బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో కూడిన బ్యాండ్ బృందం మంగళవారం ఉదయం ప్యాసింజర్ ట్రక్‌లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రక్, ఎస్‌యూవీ కారు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

బిహార్‌లోని కటిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలోని 31వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కటిహార్ ఎస్‌డీపీవో అమర్‌కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాండ్ బృందానికి చెందిన పదిమంది సభ్యులు పూర్నియా నుంచి ప్యాసింజర్ ట్రక్‌లో బయలుదేరారు. ఆటో కుర్షేలా సమీపంలోని 31వ జాతీయ రహదారిపైకి రాగానే.. ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఒకరు.. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ట్రక్కును సీజ్ చేయగా.. కారు డ్రైవర్ పరారైనట్టు అమర్‌కాంత్ తెలిపారు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు. వారంతా మజ్‌దిహా గ్రామానికి చెందిన సుశీల్ కుమార్ మోచి(30), అర్జున్ మోచి(50), కిశోర్ పాశ్వాన్(45), చోటేలాల్‌ రామ్(42), ధర్మేంద్ర కుమార్ మండాల్(50) ఉన్నారు. వీరి మృతితో స్వగ్రామమైన మజ్‌దిహాలో తీవ్ర విషాదం నెలకొంది.