close
Choose your channels

రాజకీయాల వల్ల ఎంతోమంది నష్టపోతారు: లావణ్య త్రిపాఠి

Sunday, February 28, 2021 • తెలుగు Comments

రాజకీయాల వల్ల ఎంతోమంది నష్టపోతారు: లావణ్య త్రిపాఠి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. తొలిసారి ఒక ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తున్నట్టు లావణ్య వెల్లడించింది. అయితే ఈ సినిమా కోసం తానేమీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేసింది లేదని.. వెల్లడించింది. తన పాత్రకు పెద్దగా మేకప్ కూడా ఉండదని లావణ్య తెలిపింది. ఇంకా లావణ్య వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే...

కొన్ని వర్కౌట్లు మాత్రమే చేశా..

ఒకసారి ముంబయిలో సందీప్‌కిషన్‌ను కలిశాను. అప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. స్టోరీ పాయింట్‌ వినగానే ఎగ్జైట్‌ అయ్యాను. నాక్కూడా రెగ్యులర్‌ పాత్రల్లో నటించి బోర్‌ కొట్టింది. అందుకే ఏదైనా ఛాలెంజింగ్‌ పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చేశా. ఈ చిత్రం తమిళ రీమేక్‌ అయినప్పటికి 50 శాతం అసలు కథలో మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. అలాగే ఇందులోని పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో సులభంగా పాత్రలోకి ఒదిగిపోయా. సందీప్‌ చాలా ప్రోత్సహించేవాడు. ఈ సినిమా హాకీ నేపథ్యంగా సాగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయలేదు. నేను మొదటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం వల్ల పాత్రకు తగ్గట్టు కొన్ని కొన్ని వర్కౌట్లు మాత్రమే చేశా. అలాగే నా స్కూల్‌డేస్‌లో బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. హాకీ స్కూల్లో ఉండేది కాదు. కానీ, ఈ సినిమా చేసిన తర్వాత హాకీ కచ్చితంగా స్కూల్‌ గేమ్స్‌లో ఉండాలనిపించింది. అలాగే హాకీ క్రీడాకారుల బాడీలాంగ్వేజ్‌ ఎలా ఉండాలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. చెన్నైలో కోచ్‌ సుధీర్‌గారు నాకు శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ని బాగా ఎంజాయ్‌ చేశా.

ప్రతీ క్రీడలోనూ రాజకీయాలుంటాయి..

ఒక నటిగా పాత్రల్లో నటించేటప్పుడు సహజంగా ఉండాలన్నదే నా అభిమతం. అందుకే ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మ్యాచ్‌లో భావోద్వేగాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అందుకోసం పాత హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేదాన్ని. సందీప్‌, నేనూ రెగ్యులర్‌ హీరో, హీరోయిన్‌ పాత్రల్లో నటించలేదు. ఒక హాకీ ప్లేయర్స్‌ ఎలా ప్రవర్తిస్తారో అలాగే చేశాం. కొన్ని సాంగ్స్‌లో గ్లామర్‌గా చేసినప్పటికీ ఆ ప్రభావం సినిమాపై పడకుండా జాగ్రత్తలు. ఎందుకంటే ఇందులో నా పాత్రకు పెద్దగా మేకప్‌ ఉండదు. ప్రతీ క్రీడలోనూ రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి ఆటకు ఒక్కోసారి ప్రతిబంధకంగా మారతాయి. టాలెంట్ ఉన్న ఎంతో మంది ఈ రాజకీయాల వల్ల నష్టపోతుంటారు. వాటన్నింటినీ చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం. మా లవ్‌ ట్రాక్‌ కూడా అలరిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కారణం అన్నీ అంతకు ముందు నేను చేసిన పాత్రల్లానే ఉన్నాయి. కేవలం ఒక డైలాగ్‌ చెప్పేసి, ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేస్తే సరిపోదు కదా. ఒక పాత్రకోసం శారీరకంగా కూడా కష్టపడాలి. అందుకే హాకీ బ్యాట్‌ పట్టి మైదానంలో చెమటలు చిందించాను. ఆ సమయంలో ఎంతో తృప్తిగా అనిపించేది.

రాజకీయాల వల్ల ఎంతోమంది నష్టపోతారు: లావణ్య త్రిపాఠి

మా ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఉండదు..

సందీప్‌తో నాకు ఎప్పటినుంచో పరిచయముంది. అంతకుముందు ఇద్దరం కలిసి ‘మాయావన్‌’లో నటించాం. ఈ చిత్ర నిర్మాతల్లో సందీప్‌ కూడా ఒకరు. అందుకే నాకేమైనా సమస్యలున్న అతనితో చర్చించేదాన్ని. నా మాటకు ఎంతో విలువనిస్తాడు. సందీప్‌ మంచి సహనటుడు కూడా. ‘మాయవన్‌’చిత్రంలో మా ఇద్దరి మధ్య పెద్దగా లవ్‌ ట్రాక్‌ ఉండదు. ఇందులో ఆ లోటు తీర్చాం. ఈ చిత్రం కోసం బైక్‌ నడపడం కూడా నేర్చుకున్నా. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో చాలావరకూ కొత్తవాళ్లే పనిచేశారు. ముఖ్యంగా డైరెక్టర్‌ డెన్నిస్‌ జీవన్‌తో ఎంతో సరదాగా ఉండేది. ప్రతీ షాట్‌ను చక్కగా వివరించి చేయించేవారు. దీని తమిళ మాతృక చూశాను. కానీ ఆ చిత్రంతో పోల్చుకుంటే ఈ సినిమాలో నా పాత్రకు చాలా మార్పులు చేశారు. అందుకే చాలా కొత్తగా కనిపిస్తాను. సినిమాటోగ్రాఫర్‌ కెవిన్‌ నా సోదరుడిలా కలిసిపోయాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.

విలన్‌ పాత్రలు చేయడమంటే చాలా ఇష్టం..

సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లినట్టు మా యూనిట్‌ చెబుతోంది. ఇప్పటివరకు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చూడలేదు. కారణం, సినిమాను వెండితెరపైనే చూడాలనే బలమైన కోరిక. అలాగే ఈ చిత్రం షూటింగ్‌లోనే సూపర్‌హిట్ కొట్టబోతున్నామని అర్థమైంది. కొన్నిసార్లు నాకు అలా ముందే తెలిసిపోతుంది. ఈ లాక్‌డౌన్‌లో ప్రత్యేకంగా నేను చేసిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మామూలు రోజుల్లో కూడా షూట్‌ లేకపోతే నేను ఇంట్లోనే ఉంటాను. ఇక ఓటీటీ విషయానికొస్తే ఒక స్క్రిప్ట్‌ విన్నా. చాలా బాగా నచ్చింది. కానీ కొన్నాళ్లపాటు సినిమాలు మాత్రమే చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నా. విలన్‌ పాత్రలు చేయడమన్నా నాకు చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేస్తేనే నటిగా మన సామర్థ్యం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని స్క్రిప్టులు విన్నా. పాత్రలను బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటాను.

Get Breaking News Alerts From IndiaGlitz