close
Choose your channels

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు దీవి శ్రీనివాస దీక్షితులు తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌‌లోని నాచరంలో షూటింగ్‌‌లో ఉండగా హార్ట్‌‌ ఎటాక్‌‌తో ఆయన హఠాన్మరణం చెందారు. దీక్షితులు మరణంతో ఆయన కుటుంబంలో, సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. నాచారం నుంచి ఆయన భౌతికకాయాన్ని ఇంటికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈయన నటుడు ఉత్తేజ్‌‌కు దగ్గరి బంధువు. విషయం తెలుసుకున్న ఉత్తేజ్ హుటాహుటిన నాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయనకు ఒక కుమారుడు శ్రీధర్ ఉన్నారు.

ఈయన పూర్తిపేరు దీవి శ్రీనివాస దీక్షిత్ కాగా అందరూ ఈయన్న డీఎస్ దీక్షితులుగా పిలుచుకునేవారు. హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో 1956, జులై 28న జన్మించారు. సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీలు పొందిన ఈయన నటన మీద అమితాసక్తి ఉండేది. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చర్‌‌గా కొంతకాలం ఈయన పనిచేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ యాగాలు చేసినా ఈయన కచ్చితంగా వెళ్లేవారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రతీ యాగంలోనూ ఈయన పాల్గొన్నారు.

దీక్షితులు ట్రాక్ రికార్డ్...

ఉద్యోగం వదిలి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఏపీ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రిపర్టరీలో డిప్లోమా ఇన్ థియేటర్ ఆర్ట్స్‌లో చేరారు. శిక్షణ సమయంలో 'శాకుంతలం', 'మానాన్న కావాలి', 'కీలు బొమ్మలు', 'ఆశా', 'ప్రతాపరుద్రీయం' మొదలైన నాటకాల్లో నటించారు. హరిశ్చంద్ర, సక్కుబాయి (పద్యనాటకాలు), వ్యవహార ధర్మబోధిని, వెయింటింగ్ ఫర్ గోడో, స్వతంత్ర భారతం (సాంఘిక నాటకాలు), గోగ్రహణం, కొక్కొరోకో, జాతికి ఊపిరి స్వతంత్రం (వీధి నాటకాలు) వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పాల్గొన్నారు. టీవీలో ఈయన నటించిన "ఆగమనం" సీరియల్‌కు పెద్ద సంఖ్యలోనే నంది అవార్డులు వచ్చాయి. 'ఎల్లమ్మ', 'మురారి', 'ఇంద్ర', 'ఠాగూర్', 'ప్రాణం', 'వర్షం', 'అతడు' మొదలగు చిత్రాలలో దీక్షితులు నటించి మెప్పించారు.

అవార్డులు...

‘శ్రీ కృష్ణతులాభారం’ పద్యనాటకానికి దర్శకత్వం వహించి 1999 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు బహుమతులు పొందాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, గరికపాటి రాజారావు మెమోరియల్ అవార్డు,
రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, చైతన్య ఆర్ట్ థియేటర్ అవార్డులు దీక్షితులను వరించాయి. కాగా ప్రస్తుతం ఆయన ‘అక్కినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్’లో ప్రదర్శన కళలన్నిటికీ సంబంధించిన శిక్షణను నిర్వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.