నిన్న బాలయ్య.. ఇవాళ ఏకంగా టీడీపీనే టార్గెట్ చేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నిన్న, మొన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఆయన.. ఇవాళ ఏకంగా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వైసీపీ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు..? అన్న మాటలతో మొదలుపెట్టిన ఆయన.. వైసీపీతో సహా ఏ పార్టీ అయితే ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ వుంది..? అనే విషయాలపై ఆయన వరుస ట్వీట్స్ చేశారు. ఇవాళ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరుస ట్వీట్ల వర్షం కురిపించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైసీపీ లేదా బీజేపీ లేదా జనసేన అధికారంలోకి వస్తుంది కానీ.. టీడీపీ మాత్రం రాదని చెప్పుకొచ్చారు.

టీడీపీ మాత్రం అస్సలు అధికారంలోకి రాదు..

‘ఒక్కటి మాత్రం నిజం అధికారంలోకి వచ్చిన వైసీపీ తరువాత.. మళ్లీ వైసీపీ పార్టీ వస్తుందో జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్స్‌లో తప్ప నిజంగా చేసింది చాలా తక్కువ. అందుకే ఎలక్షన్స్‌లో చాలా ఘోరంగా ఓడిపోయిందన్న విషయం టీడీపీ వారు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి భ్రమలో నుంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలోనే జీవిస్తామంటే వారిని స్వాగతించాల్సిందే. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి వాటిని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం- వినిపించడం అంటారు. ఆ భ్రమలకు ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వరుస ట్వీట్స్‌పై నెటిజన్లు, అభిమానులు పెద్దఎత్తున స్పందిస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.