Download App

Amar Akbar Anthony Review

ర‌వితేజ‌, శ్రీనువైట్ల అంటే ఎవరికైనా వెంట‌నే గుర్తుకు వ‌చ్చే సినిమాలు రెండే వెంకీ, దుబాయ్ శీను. వీరి కాంబినేష‌న్‌లో మూడు సినిమాలు రూపొందినా ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో హిట్ అయినా వెంకీ, దుబాయ్ శీను చిత్రాలే అంద‌రికీ గుర్తున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన నాలుగో చిత్ర‌మే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. ఇందులో ర‌వితేజ మూడు షేడ్స్‌లో న‌టించాడు. . ఇలియానా ఆరేళ్ల త‌ర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డమే కాదు.. తొలిసారి త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవ‌డం విశేషం. అస‌లు ర‌వితేజ మూడు షేడ్స్ ఉన్న ఈ సినిమాను ఒప్పుకోవ‌డానికి రీజ‌న్ ఏంటి?  చాలా కాలంగా మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీనువైట్ల‌కు ఈ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ వ‌చ్చిందా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

క‌థ‌:

న్యూయార్ జైలు నుండి విడుద‌లైన అమ‌ర్‌(ర‌వితేజ‌) త‌న కుటుంబంతో పాటు త‌ను ఇష్ట‌ప‌డిన అమ్మాయి ఐశ్వ‌ర్య(ఇలియానా) కుటుంబాన్ని నాశ‌నం చేసిన వారు రాజ్ వీర్‌(రాజ్ వీర్ సింగ్‌), విక్ర‌మ్ త‌ల్వార్‌(విక్ర‌మ్ జీత్ విర్క్‌), సాబు మీన‌న్‌(ఆదిత్య మీన‌న్‌), క‌ర‌ణ్ ఆరోరా(త‌రుణ్ ఆరోరా)ల‌ను చంపడానికి ప్లాన్ చేస్తాడు. అందులో ముందుగా రాజ్‌వీర్‌ను చంపేస్తాడు. దాంత మిగిలిన వారు పోలీస్ ఆఫీస‌ర్‌(అభిమ‌న్యు సింగ్‌) స‌హాయం కోరుతారు. పోలీస్ .. అమ‌ర్‌ను వెతికే ప‌నిలో ఉంటాడు. మ‌రో ప‌క్క అమెరికాలో జరిగే తెలుగు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే వాటా అధ్య‌క్షుడు పుల్లారెడ్డి(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి).. ఆరోగ్యం స‌రిగ్గా లేక వ్య‌వ‌హ‌రాల‌ను గండికోట‌(ర‌ఘుబాబు), కందుల‌(శ్రీనివాస్ రెడ్డి), మిర్యాల చంటి(వెన్నెల కిషోర్‌), చేత‌న‌శ‌ర్మ‌(గిరిధ‌ర్‌)ల‌కు అప్ప‌గిస్తాడు. వీరిలో చేత‌న్ శ‌ర్మ మంచివాడు. మిగిలిన ముగ్గురు మాత్రం ఈవెంట్‌కు వ‌చ్చిన అతిథుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. అదే ఈవెంట్‌కు వ‌చ్చిన అక్బ‌ర్‌(ర‌వితేజ‌) వారి వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెడ‌తాడు. ఈవెంట్ మేనేజ‌ర్ పూజ‌(ఇలియానా) .. త‌ను ఓ డిజార్డ‌ర్‌తో బాధ‌పడుతుంద‌ని తెలుసుకుని డాక్ట‌ర్ ఆంటోని(ర‌వితేజ‌)ను క‌లుస్తుంది. అస‌లు అమ‌ర్‌, అక్బ‌ర్ ఆంటోని ఎవ‌రు?   ముగ్గురు ఒకేలా ఎందుకు ఉంటారు.? అస‌లు ఈ ముగ్గురికిపూజకి సంబంధం ఏంటి? అమ‌ర్ త‌న ప‌గ‌ను ఎలా తీర్చుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

ర‌వితేజ అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోని అనే మూడు పాత్ర‌ల‌ను చ‌క్క‌టి వేరియేష‌న్స్‌తో ప్రెజంట్ చేశాడు. మ‌రో ర‌కంగా చెప్పాలంటే పాత్రల ప‌రంగా న‌ట‌న‌, హావ‌భావాల్లో చేంజ్ క‌న‌ప‌డుతుంది కానీ లుక్ ప‌రంగా పెద్ద చేంజ్ లేదు కాబ‌ట్టి..ర‌వితేజ పెద్ద‌గా ఇబ్బంది ప‌డింది. న‌ట‌న ప‌రంగా మెప్పించాడు. ఇక యాక్ష‌న్‌, డాన్సులతో ర‌వితేజ..ఎప్ప‌టిలాగానే ఆక‌ట్టుకున్నాడు. ఇలియానా బొద్దుగా బాగానే ఉంది.. డ‌బ్బింగ్ కూడా బాగానే చెప్పింది. సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ సి.దిలీప్ ప్ర‌తి సీన్‌ను విజువ‌ల్‌గా చ‌క్క‌గా తెరెక్కించాడు. నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌:

శ్రీనువైట్ల ఈ కొత్త క‌థ‌ను చెప్పాల‌నుకోలేదు.. క‌థ‌ను కొత్త‌గానూ చెప్పాల‌నుకోలేదు. అప‌రిచితుడులో హీరో విక్ర‌మ్ కు ఉన్న డిజార్డ‌ర్ అనే పాయింట్‌ను అత‌నొక్క‌డే సినిమాలో హీరో ఫ్యామిలీ రివేంజ్‌కు మిక్స్ చేసి రాసుకున్నాడు. ఆడియెన్స్ ఈ రెండు సినిమాల‌ను చూసేశారు కాబ‌ట్టి కొత్త‌గా ఏం ఫీల్ కాలేదు. పోనీ స‌న్నివేశాల‌ను ఏమైనా ఆస‌క్తిక‌రంగా రాసుకున్నాడా? అంటే అదీ లేదు. అభిమన్యు సింగ్ పాత్ర‌ను చివ‌ర్లో మ‌రీ డ‌మ్మీ చేసేశాడు. ఇక వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి అసోసియేష‌న్ స‌భ్యులుగా చేసిన కామెడీకి స‌త్య జూనియ‌ర్ పాల్‌గా.. క్షుద్ర విద్య‌లు చేసుకునే కాద్రాగా చేసిన కామెడి.. అప్పుల బాబీగా సునీల్ కామెడీ ఇలా విడి విడిగా బాగానే ఉంది కానీ.. మొత్తంగా ఎఫెక్టివ్‌గా లేదు. త‌మ‌న్ పాట‌లు బాగా లేవు.

స‌మీక్ష‌:

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కామెడీల‌తో ఢీ, రెడీ, దూకుడు వంటి సినిమాల‌ను తెరకెక్కించి స‌క్సెస్ సాధించిన శ్రీనువైట్లకు కొంత‌కాలంగా స‌రైన హిట్ లేదు. అలాంటి స‌మ‌యంలో మైత్రీమూవీస్ వంటి బ్యాన‌ర్‌లో ర‌వితేజ సినిమా చేయ‌డ‌మ‌నేది ఓ ర‌కంగా ప్ల‌స్ అయినా.. శ్రీనువైట్ల కొత్త‌గా ఏదీ చెప్పాల‌నుకోలేదో ఏమో.. రెండు సినిమాల క‌థ‌ల‌ను మిక్స్ చేసి రాసేసుకున్నాడు. స‌రే స‌న్నివేశాలైనా ఆస‌క్తికరంగా ఉన్నాయా? అవీ లేవు. ఫ‌స్టాఫ్‌లో ఉన్న కామెడీ సైతం సెకండాఫ్‌లో క‌న‌ప‌డ‌దు. శ్రీనువైట్ల న‌మ్ముకున్న కామెడీ కూడా స‌పోర్ట్ చేయ‌లేక‌పోయింది. అందుకు కార‌ణం బ‌లమైన క‌థ లేదు. పాత్ర‌ల తీరు తెన్నులు బ‌లంగా అనిపించ‌వు. పాత్ర‌ల‌ను స‌రిగ్గా ఎలివేట్ చేయ‌డంలో శ్రీనువైట్ల పూర్తిగా ఫెయిల‌య్యాడు. పాత్ర‌ల‌ను స‌రిగ్గా డిజైన్ చేసుకోలేదు. ల‌య‌, అభిరామి చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన సినిమా ఇది. అయితే వారికి త‌గిన పాత్ర‌ల‌ను రాసుకోలేదు. స‌రే.. ఉన్న క‌థ‌లో వారిని ఏమైనా ఎలివేట్ చేశాడా అంటే అదీ లేదు.. అక్క‌డ‌క్క‌డ రెండు మూడు సెకన్స్ పాటు వారి పాత్ర‌లు క‌న‌ప‌డ‌తాయి. ల‌య కూతురు కూడా తొలిసారి న‌టించిన సినిమా ఇదే. ఆ పాప‌, అమ‌ర్ పాత్ర‌లోని అబ్బాయికి మ‌ధ్య ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు. మంచి క‌థల‌కు మంచి నిర్మాత‌లు లేకుండా.. ద‌ర్శ‌కులు చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్న ఈరోజుల్లో ఇమేజ్ ఉన్న హీరో.. ఖ‌ర్చుకు ఏమాత్రం వెనుకాడ‌ని నిర్మాత‌లు దొరికినా శ్రీనువైట్ల అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

బోట‌మ్ లైన్‌:

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని.. రెండు క‌థ‌ల‌ను మిక్స్ చేసి రాసుకున్న ఈ సినిమాలో ఎమోష‌న్స్ లేవు.. ఆస‌క్తిక‌రమైన స‌న్నివేశాలు కూడా లేవు. ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్ అన‌గానే గ‌త చిత్రాల త‌ర‌హాలో కామెడీ ఉంటుంద‌నుకుంటే పొర‌బ‌డ్డ‌ట్లే..  ఈ సినిమాలో కామెడీ ఉంది కానీ.. మెప్పించే స్థాయిలో మాత్రం లేదు. మొత్తంగా మిక్సింగ్ క‌థ‌ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌డం క‌ష్ట‌మే.

Read Amar Akbar Anthony Movie Review in English

Rating : 2.3 / 5.0