Download App

Amma Rajyamlo Kadapa Biddalu Review

ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. త‌ర్వాత హార‌ర్‌, మాఫియా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత అదే పంథాలో సినిమాలు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఆయ‌న సినిమాల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అయితే సోష‌ల్ మీడియా పుణ్య‌మాని వ‌ర్మ ఎప్పుడు వార్త‌ల్లో ఉంటూ వ‌చ్చాడు. తాజాగా ఈయ‌న క‌న్ను పొలిటిక‌ల్‌పై ప‌డింది. ముఖ్యంగా ఏపీ పొలిటిక‌ల్ అంశాల చుట్టూనే వ‌ర్మ వ‌రుస సినిమాలు చేయ‌డం స్టార్ట్ చేశాడు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిపై ఎవ‌డు బ‌లాన్ని చూపాల‌నుకోడు. అనే రూపంలో ఇప్పుడు వ‌ర్మ రాజ‌కీయంగా ఓ మాజీ ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఫ‌లితంగా ఆయ‌న సినిమాలు వివాద‌స్ప‌ద‌మవుతున్నాయి. వ‌ర్మ‌కు కావాల్సినంత ఫ్రీ ప‌బ్లిసిటీ ద‌క్కుతుంది. ఆ కోవ‌లో వ‌ర్మ రూపొందించిన చిత్రం `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు`. అస‌లు ఈ సినిమాలో వ‌ర్మ ఎవ‌రిని టార్గెట్ చేశాడు?  ఎందుక టార్గెట్ చేశాడు?  అనే విష‌యాలు తెలియాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

ఎన్నిక‌ల్లో జ‌గ‌న్నాథ‌రెడ్డి(అజ్మ‌ల్‌) ఆర్‌.సి.పి పార్టీ.. వెలుగుదేశం పార్టీపై ఘ‌న విజ‌యం సాధిస్తుంది. 151 సీట్లు సాధించిన జ‌గ‌న్నాథ‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే త‌న‌కంటే చిన్న‌వాడు ముఖ్య‌మంత్రి కావ‌డం.. త‌న కొడుకు చిన‌బాబు ఏమీ చేయ‌లేక‌పోతుండ‌టంతో బాబు బాధ‌ప‌డుతుంటాడు. దీనికి తోడు అవ‌మానాలు ఎదురు కావ‌డంతో బాబు అహం మ‌రింత దెబ్బ తింటుంది. దీంతో జ‌గ‌న్నాథరెడ్డి ప్ర‌భుత్వాన్ని అబాసు పాలు చేయ‌డానికి బాబు ఇత‌ర పార్టీల‌తో చేతులు క‌లుపుతాడు. బాబుకు తోడుగా ద‌య‌నేని ర‌మ క‌లుస్తాడు. ఇత‌ను కూడా జ‌గ‌న్నాథ‌రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ ద‌య్య‌ప‌డుతుంటాడు. జ‌గ‌న్నాథ‌రెడ్డి కూడా త‌న మ‌నుషుల‌తో గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తూనే ఉంటాడు. ఆ స‌మ‌యంలో ఓరోజు కొంద‌రు దుండ‌గులు ద‌య‌నేని ర‌మ‌ను హ‌త్య చేస్తారు. ఆ హ‌త్య జ‌గ‌న్నాథ‌రెడ్డి చేయించాడ‌ని బాబు విమ‌ర్శ‌లు చేస్తాడు. అస‌లు జ‌గ‌న్నాథ రెడ్డి హ‌త్య చేయించాడా?  ర‌మ‌ను హ‌త్య చేయించిందెవ‌రు?  ప్ర‌పంచ శాంతి పార్టీ జాల్‌, మ‌న సేన పార్టీ నాయ‌కుడు ప్ర‌ణవ్ క‌ల్యాణ్ ఈ రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

స‌మీక్ష‌: 

రామ్‌గోపాల్ వ‌ర్మ అంటే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారాడు. సాధార‌ణంగా ఉండేవాళ్ల‌ను గిల్లి ఏడ‌వ‌లేదెంటా! అని చూసే వ‌ర్మ‌.. ఈ సినిమాలో ఓ ప్ర‌ధాన నాయ‌కుడిని, పార్టీని టార్గెట్ చేస్తూ ఓ సినిమా చేశాడు. ఇది వ‌ర‌కు స‌ద‌రు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు చాలా స‌మస్య‌లు ఎదుర‌య్యాయి. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీగా మారిన పార్టీని ఉద్దేశించే వ‌ర్మ `అమ్మ రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు` సినిమాల చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేశాడు?  అనే విష‌యాల‌ను ఆయ‌న పాత్ర‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఎందుకంటే ఆ పాత్ర‌ల‌న్నీ నిజ జీవితంలోని పాత్ర‌ల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. కానీ ఈ విష‌యం వ‌ర్మ‌ను అడిగితే త‌న‌కేం తెలియ‌దని, మీకెవ‌రైనా గుర్తుకొస్తే నాకేం సంబంధం లేద‌ని వితండ‌వాదం చేస్తాడు. ఇక సినిమా విషయానికి వ‌స్తే వివాదాల‌కు ప్రాధాన్య‌త నిచ్చే వ‌ర్మ ఈ క‌థ‌పై కాన్‌స‌న్ ట్రేష‌న్ పెడితే బావుండేది. పాత్ర‌ల‌ను శ‌ద్ధ‌గా ఎంపిక చేసిన వ‌ర్మ.. ఆ శ్ర‌ద్ధ‌ను సినిమాను తెర‌కెక్కించ‌డంపై చూపెట్టలేదు. అజ్మ‌ల్‌, బాబు పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఆయా పాత్ర‌లు అనుక‌రించే విధానం ముఖ్యంగా జాల్ పాత్ర‌..ప్రేక్ష‌కుల‌ను కాసేపు న‌వ్విస్తుంది. అయితే వ‌ర్మ తాను ఊహించిందే రాజ‌కీయాలు అనే చందాన సినిమాను తెర‌కెక్కించేశాడు. సినిమాలో హ‌త్య అనే బ్యాంగ్ ఇచ్చిన త‌ర్వాత సెకండాఫ్ సాగ‌దీత‌గా అనిపించింది. ఏదో పొలిటిక‌ల్ స్పూఫ్‌గా తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. బోరింగ్ ట్రీట్‌మెంట్, స్క్రీన్‌ప్లే ప్రేక్ష‌కుడికి అస‌హనాన్ని క‌లిగిస్తుంది. జ‌గ‌దీశ్ చీక‌టి, ర‌విశంక‌ర్ సంగీతం సినిమాలో బాగానే ఉన్నా.. టేకింగ్ వీట‌న్నింటిని మ‌రుగున ప‌డేసింది.

చివ‌ర‌గా.. అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు.. రామ్ గోపాల్ వ‌ర్మ రాజ‌కీయాలు

Read 'Amma Rajyamlo Kadapa Biddalu' Review in English

Rating : 1.5 / 5.0