మా ఎన్నికలు: ‘‘ రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా ’’... ఓటమిపై అనసూయ సంచలన ట్వీట్

  • IndiaGlitz, [Tuesday,October 12 2021]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫిలింనగర్‌లో వేడి చల్లారలేదు. ఫలితాలు కొందరికి ఆనందాన్ని ఇవ్వగా.. ఇంకొందరు తీవ్ర నిరాశను కలిగించాయి. వారు రకరకాలుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక అసలు మేటర్‌లోకి వెళితే.. ‘‘మా’’ ఎన్నికల్లో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్‌గా ఆమె బరిలో నిలిచారు. ఆదివారం కౌంటింగ్ సందర్భంగా ఆమె గెలిచినట్లు కూడా ప్రకటించారు సభ్యులు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి అనసూయ తొలిసారి పోటీ చేసి గెలుపొందింది అంటూ ఈమెకు సోషల్ మీడియాలో అభిమానులు, సన్నిహితుల నుంచి అభినందనల వెల్లువ కూడా మొదలైంది. అనసూయ కూడా తాను గెలిచానేమో అనుకుని సంబరాలు చేసుకుంది.

కానీ ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం ప్రకటించిన అధికారిక ఫలితాల్లో అనసూయ పేరు ఎక్కడా కనిపించలేదు. ఈసీ మెంబర్లుగా రెండు ప్యానెళ్ల నుంచి 18 మంది ఎన్నికయ్యారు. ఇందులో పది మంది మంచు విష్ణు ప్యానెల్ తరుపున గెలవగా.. మిగిలిన 8 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచారు. అయితే అనసూయ పనిచేసే జబర్ధస్త్‌కు చెందిన నటుడు సుధీర్‌ 279 ఓట్లతో ఈసీ మెంబర్‌గా గెలుపొందడం విశేషం. ఊహించని ఈ షాక్‌తో ఎన్నికల ఫలితాల మీద అనసూయ తన స్టైల్లో కౌంటర్లు వేసింది.

‘క్షమించాలి.. ఒక విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తోంది.. మీతో పంచుకుంటున్నా.. ఏమనుకోకండి.. నిన్న ‘అత్యధిక మెజార్టీ’, ‘భారీ మెజార్టీ’తో గెలుపు అని.. ఈ రోజు ‘‘లాస్ట్, ఓటమి’’ అని అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా?.. అసలు ఉన్న సుమారు 900 ఓటర్లలో సుమారు 600 చిల్లర ఓట్ల లెక్కింపుకి రెండో రోజుకి వాయిదా వేయాల్సింత టైం ఎందుకు పట్టిందంటారు? అహ అర్ధంకాక అడుగుతున్నాను’ అంటూ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అనసూయ చెప్పకనే చెప్పారు. మరి దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.