ఆంధ్రప్రదేశ్‌లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం - మంత్రి లోకేష్


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల అవకాశాలు, విధానాల మార్పులపై సమావేశంలో అధికారులు సమగ్రంగా వివరణ ఇచ్చారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం
ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా 5,27,824 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారుల వివరించారు. మంత్రి లోకేష్, పెట్టుబడిదారులకు అవరోధంగా మారుతున్న విధానాల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్ ఆధునికీకరణ
ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భూకేటాయింపులు, అనుమతుల ప్రక్రియల్లో పారదర్శకత కోసం ట్రాకర్‌లో అన్ని వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పెట్టుబడిదారులకు తక్షణమే అనుమతులు, రాయితీలు మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేయాలని తెలిపారు.
ఎంఎస్ఎమ్ఈలకు విస్తృత ప్రోత్సాహం
రాష్ట్రంలో ఎంఎస్ఎమ్ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను మరింత శక్తివంతం చేయాలని నిర్ణయించారు. టూరిజం, మైనింగ్, పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, ఎంఎస్ఎమ్ఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించేందుకు కృషి చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments