close
Choose your channels

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్స్‌కు తెలంగాణలోకి నో ఎంట్రీ..

Monday, May 10, 2021 • తెలుగు Comments

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొవిడ్ రోగులను తెలంగాణ సర్కార్ అనుమతించక పోవడం సంచలనంగా మారింది. తెలంగాణలోకి వస్తున్న కొవిడ్ పేషెంట్స్‌ను రాష్ట్రంలోకి అనుమతించే విషయమై టీఎస్ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డుకుంటోంది. చెక్ పోస్టు వద్ద మకాం వేసిన పోలీసులు ఏపీ నుంచి వచ్చే కోవిడ్ రోగుల అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Also Read: ఏపీలో అత్యవసర ప్రయాణం చేయాలంటే ఇది తప్పనిసరి..

అంబులెన్స్‌ల్లో వస్తున్న రోగులకు తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతిస్తున్నారు. లేదంటే వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నిరోధించడానికే తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. కాగా.. సాధారణ ప్రయాణికులను మాత్రం రాష్ట్రంలోకి తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో కరోనా బాధితులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా వచ్చి చికిత్స పొందుతున్నారు. మరి ఏపీకి మాత్రమే ఈ నిబంధనలేంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా చికిత్స కోసం తరలి వస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు వంద మంది వరకు కరోనా బాధితులు ఇక్కడకు వచ్చారు. ఢిల్లీ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడకు క్యూ కట్టారు. లోక్నో, పాట్నా, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు చెందిన కరోనా బాధితులు ఎయిర్‌ అంబులెన్స్‌లలో వచ్చి అపోలో, యశోద, కాంటినెంటల్‌, కిమ్స్‌, సన్‌షైన్‌ తదితర ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నెల రోజుల నుంచే పలు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన అంబులెన్స్‌లలో రోగులు ఇక్కడకు రావడం మొదలైంది.

రోడ్డు మార్గాన అంబులెన్స్‌లో తరలించడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో ప్రముఖులు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలు ఏర్పాటు చేసుకుని మరీ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. వచ్చే వారు చాలా ఆందోళనకర పరిస్థితుల్లోనే ఇక్కడకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో చాలా మందికి ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది వచ్చి చికిత్స తీసుకుని వెళుతుంటే ఏపీకి మాత్రం నిబంధనలేంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz