close
Choose your channels

'అన్నపూర్ణమ్మగారి మనవడు' ఆడియో విడుదల

Friday, November 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్నపూర్ణమ్మగారి మనవడు ఆడియో విడుదల

అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్‌ నటి అన్నపూర్ణ, ఆమె మనవడిగా మాస్టర్‌ రవితేజ నటించిన తాజా చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్మెన్నార్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌ సీడితో పాటు ఆడియో సీడీలను ఆవిష్కరించగా...తొలి సీడీని మరో అతిథిగా పాల్గొన్న కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ (దాము) అందుకున్నారు. చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్‌ ప్రతినిధి మాధవ్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, దర్శకుడు శివనాగు ఆర్టిస్టు కావాలనుకుని చిత్ర పరిశ్రమలోనికి వచ్చారు. ఆ తర్వాత అభిరుచితో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్‌, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే...పల్లెటూరి వాతావరణాన్ని, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను చాటిచెప్పేవిధంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రబృంద ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు కుటుంబ బంధాలను...వాటికున్న విలువలను, ప్రాధాన్యాన్ని చెప్పే ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకో అతిథి వి.సాగర్‌ మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి టైటిల్స్‌ పెడుతున్న ఈ రోజుల్లో అందరూ చూసే చక్కటి కథతో, మంచి టైటిల్‌తో ఈ చిత్రాన్ని తీయడం అభినందనీయమని అన్నారు. అభిరుచి కలిగిన దర్శకుడికి అభిరుచి కలిగిన నిర్మాత తోడు కావడం వల్లే ఇలాంటి చక్కటి చిత్రాలు వస్తాయని అన్నారు. టైటిల్‌ పాత్రధారి, సీనియర్‌ నటి

అన్నపూర్ణ మాట్లాడుతూ, దర్శకుడు ఈ చిత్రకథ చెప్పగానే వెంటనే నటించాలనిపించింది. ఇందులో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథకు ప్రాధాన్యమిచ్చి తీసిన చిత్రమిది. నాకు మనవడుగా నటించిన మాస్టర్‌ రవితేజ ఎంతో ఈజ్‌తో నటించాడు. అతనికి చాలా మంచి భవిష్యత్‌ ఉంటుంది అని అన్నారు.

మనవడు పాత్రధారి మాస్టర్‌ రవితేజ మాట్లాడుతూ, అన్ని రసాలను మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించడం ఆనందంగా ఉంది. దర్శకుడి వల్లే పాత్రను రక్తికట్టించే అవకాశం నాకు కలిగింది అని అన్నారు.

దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, లోగడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పలు చిత్రాలను రూపొందించాను. పల్లెటూరి ప్రేమలను...వాతావరణాన్ని ప్రతింబించే చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అలాంటి కథను ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచాం. నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మాస్టర్‌ రవితేజ మనవడి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. బడ్జెట్‌ ఎక్కువైనా నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి ఎక్కడా రాజీపడకుండా సినిమా బాగా రావాలని ఎంతో సహకరించారు. సీనియర్‌ నటి జమునగారు అక్కినేని అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు అని అన్నారు.

నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి మాట్లాడుతూ, డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతోనే దీనిని తీశాం. అందరి సహకారంతో మేము అనుకున్నట్లుగా చిత్రం చాలాబాగా వచ్చింది అని అన్నారు. ఈ వేడుకలో నటుడు బెనర్జీ, గాయని పసల బేబి, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్‌, నటుడు గోవిందరాజుల చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.