close
Choose your channels

ఏపీలో ‘దిశ’ చట్టం వచ్చేసింది.. వేధించారో అంతే సంగతులు!

Friday, December 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ‘దిశ’ చట్టం వచ్చేసింది.. వేధించారో అంతే సంగతులు!

నిర్భయ లాంటి ఘటనల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. రోజు రోజుకూ నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ.. ఇటీవల కాలంలో తెలంగాణలో దిశ.. రేపు మరెక్కడ ఇలాంటి ఘోరాలు జరుగుతాయో అని మహిళలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ‘ఏపీ దిశ చట్టం’ను తీసుకొచ్చింది. శుక్రవారం నాడు ఈ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టగా.. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ఆమోదించారు. దీంతో చట్టానికి సంబంధించిన బిల్ పాసయ్యింది. మరోవైపు శాసన మండలిలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. అందరూ అంగీకరించడంతో బిల్ ఈజీగనే పాసయ్యింది.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లు అని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష -ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే కఠిన శిక్ష పడుతుంది’ అని అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. అనంతరం చట్టంలో అన్ని విషయాలు ఏ నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్షలు అని నిశితంగా సభ్యులకు ఆమె వివరించారు.

చలింపోయిన జగన్.. అభలల కోసం కొత్త చట్టం!
మహిళల భద్రత పట్ల ఓ చారిత్రాత్మక బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రికి అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘వైఎస్ జగన్ మహిళా పక్షపాతి. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత మహిళలను హోం మంత్రిగా, గిరిజన మహిళలను ఉపముఖ్యమంత్రిగా చేయడం, ఎంతోమంది మహిళలకు శాసన సభ్యులుగా అవకాశం కల్పించడం, నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50% రిజర్వుషన్ కల్పించడం ఘనత ముఖ్యమంత్రి జగన్‌కి మాత్రమే దక్కుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కుదిపివేసే సంఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ, జమ్ములో ఫత్వాలో బాలిక, హైదరాబాద్‌లో దిశ వంటి ఘటనలు చూసి దేశవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆడపిల్లల తల్లితండ్రులు ఆ అమ్మాయి స్థానంలో తమ పిల్లలను ఊహించుకుని భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం అని గాంధీ గారు అన్నారు. కానీ పట్టపగలే మహిళ ధైర్యంగా తిరగలేని పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి.దిశ ఘటనతో ఎంతగానో చలించిపోయిన సీఎం జగన్ మన రాష్ట్రంలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ఒక రక్ష. ఎవరైనా మహిళలపై చెయ్యేస్తే కఠిన శిక్ష పడుతుంది’ అని హోం మంత్రి చెప్పుకొచ్చారు.

ఈ చట్టం ప్రకారం ఏదైనా నేరం జరిగితే...

నేరస్తులు నిర్భయంగా సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదు.

14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుంది

ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తాం

ఆంధ్రప్రదేశ్ మహిళలకు అభయాంధ్రప్రదేశ్‌గా..!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే ఇక అంతే సంగతులు. వారి పాల్పడిన ఘటనను బట్టి కఠిన శిక్షలు తప్పవు. ఈ చట్టం గురించి హోం మంత్రి పలు విషయాలను సభ్యులతో పంచుకున్నారు. ‘చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ మహిళలు ఎంతో అభద్రతా భావంతో ఉన్నారు. వారికి భరోసా కల్పించేలా దిశ చట్టాన్ని తేవడం, వారి రక్షణకు పూనుకోవడం పట్ల రాష్ట్ర మహిళలందరి తరఫునా నేను సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిశ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ, నేరస్తులకు త్వరితంగా శిక్షలు పడేలా, అది కూడా కఠిన శిక్షలువేసేలా ఈ చట్టం రూపొదిస్తున్నారు. ఏ మాధ్యమం ద్వారా అయినా మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేసినా వాళ్లకు 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా 354 E సెక్షన్ తీసుకువస్తున్నాం. ఒకసారి ఈ శిక్ష పడ్డవాళ్లు తిరిగి అదే నేరానికి పాల్పడితే వారికి 4 సంవత్సరాలు. కఠిన శిక్ష పడేలా ఈ చట్టం రూపొందింది. 354 F బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచార, అఘాయిత్యాల ప్రయత్నం చేసినా గరిష్టంగా 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తెస్తున్నారు. 354 G ద్వారా హాస్టల్ లేదా పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, వార్డెన్లు కానీ, మహిళా ఖైదీల పట్ల జైలు వార్డెన్లు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. మహిళలపట్ల ఈ రాష్ట్రం అభయాంధ్రప్రదేశ్‌గా ఉండేలా ఈ చట్టాలను రూపొందించడం జరిగింది. దిశ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు అభయాంధ్రప్రదేశ్‌గా మారుతుంది’ అని హోం మంత్రి సుచరిత తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.