కరోనాపై ఆందోళన వద్దు.. పారాసిట్‌మాల్‌ వేసుకోండి!

కరోనాపై ఆందోళన వద్దని.. పారాసిటిమాల్ వేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. కాగా ఇదివరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే పారాసిటిమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు.. అప్పట్లో పారాసిట్‌మాల్‌-650 గ్రాములు వేసుకోవాలని రమేష్ ప్రకటించి నవ్వుల పాలయ్యారు. అయితే తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన ఆయన.. మరోసారి పారాసిట్‌మాల్‌-650 ఎంజీ వేసుకోవచ్చని.. అస్ప్రిన్‌ మాత్రం అస్సలు వేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 168 మందికి కరోనా నెగటివ్‌ వచ్చిందని.. 11,421 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. అయితే.. 53 మంది ఐసోలేషన్‌ వార్డులో ఉన్నారని.. రాష్ట్రంలో 800 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. త్వరలోనే మరో 200 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తామన్నారు.

కఠిన చర్యలు!

‘లక్ష ఎన్‌-95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా వ్యవహరించాలి. వయసు పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర సర్వీసులన్నీ నడుస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే మాస్క్‌లు వేసుకోవాలి. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి బియ్యం, కిలో కందిపప్పు ఇస్తాం. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు’ అని రమేష్ హెచ్చరించారు.

ఆందోళన వద్దు

‘కరోనాతో ఆందోళన వద్దు.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. పారాసిట్‌మాల్‌-650 ఎంజీ వేసుకోవచ్చు, అస్ప్రిన్‌ వేసుకోవద్దు. గ్రామాల్లో స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉంది. నిత్యావసరాల దుకాణాలను రోజంతా తెరిచి ఉంటే యోచన చేస్తున్నాం. తోపుడు బండ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు. వైద్యుల సూచనలు లేకుండా హైడ్రో క్లోరోక్విన్‌ వాడొద్దు’ అని ఈ సందర్భంగా రమేష్‌ స్పష్టం చేశారు.