YS Jagan : విశాఖే రాజధాని.. త్వరలో నేనూ అక్కడికే షిఫ్ట్ అవుతున్నా : సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


మూడు రాజధానులపై తొలి నుంచి స్పష్టతతో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. వీలైనంత త్వరగా విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని తొలి నుంచి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతోందని.. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశాఖకు రావాల్సిందిగా పెట్టుబడిదారులను జగన్ ఆహ్వానించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలోనే ఇన్వెస్టర్ల సదస్సు జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు:
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులుకు వున్న అనుకూల పరిస్ధితులను సీఎం వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ గడిచిన మూడేళ్లుగా నెంబర్ వన్‌గా వుందని ఆయన తెలియజేశారు. దేశంలో ఏర్పాటు చేస్తున్న మూడు ఇండస్ట్రియల్ కారిడార్‌లలో మూడు ఏపీకే వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.
రాజధాని రైతుల వ్యూహమేంటో :
కాగా.. ఉగాది నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడతారని ఏపీ మంత్రులు ఇటీవలి కాలంలో వ్యాఖ్యానించారు. అయితే దీనిని పలువురు ప్రచారంగానే కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోనున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు పలుమార్లు పాదయాత్రలు చేయడంతో పాటు కోర్టులను సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు, రాజధాని రైతులు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.