close
Choose your channels

12కే ట్రెండ్స్.. 2కు తొలి ఫలితం.. అర్ధరాత్రి ‘ఏపీ’ తుది ఫలితాలు!

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుమారు 42 రోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠ.. ఓటరు దేవుడయితే తీర్పు ఇచ్చేశాడు కానీ.. ఫలితమే చాలా ఆస్యమైంది. దీంతో అసలు తాము నెగ్గుతామో లేదో అభ్యర్థులు.. తమ అభిమాన నేతలు నెగ్గుతారో లేదో అని ఫ్యాన్స్, కార్యకర్తలు టెన్షన్.. టెన్షన్.. ఈ మొత్తం వ్యవహారానికి రేపటి రోజు వచ్చే ఫలితాలతో తెరపడనుంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్-11 నుంచి మే-19 వరకు మొత్తం 7 విడతలుగా జరిగిన ఎన్నికలకు గాను మే-23న ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఏపీ ఫలితాలకోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారో.. ఏమో..? అని.. ఎప్పుడెప్పుడు కౌంటింగ్ ప్రారంభం అవుతుందా అని మరికొందరు వేచి చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్, భద్రత, తొలి ఫలితం, ట్రెండ్స్ ఎప్పుడు తెలుస్తాయ్..? ఫైనల్‌ ఫలితాలు ఎప్పుడొస్తాయ్ అనే విషయాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు వివరించారు.

8 గంటలకు పోస్టల్.. 8:30 ఈవీఎంలు!

గురువారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది స్పష్టం చేశారు. అమరావతిలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 3లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 28వేల సర్వీస్‌ ఓట్లు జారీచేశాం. మొదట పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం 12 గంటలలోపు ట్రెండ్స్ తెలిసిపోతాయని ద్వివేదీ చెప్పుకొచ్చారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని.. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని ద్వివేది చెప్పుకొచ్చారు.

భద్రతా ఏర్పాట్లు గురించి..

"ఓట్ల లెక్కింపులో 25 వేల సిబ్బంది పాల్గొంటారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశాము. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. అందరినీ చెక్‌చేసి లోపలకు పంపుతారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే వాహనాలను అనుమతించరు. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాలను పెడతాం. మొత్తం 25వేల మంది పోలీసు బలగాలను మోహరిస్తున్నాం. 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలను పెట్టాం. ఇంకా పది కంపెనీల బలగాలను కేంద్రం పంపిస్తోంది" అని ద్వివేదీ చెప్పుకొచ్చారు.

ఫలితాలు ఎప్పుడు!

"అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీప్యాట్ స్లిప్స్ లెక్కిస్తాం. స్లిప్పుల లెక్కింపు కోసం వీవీప్యాట్లను లాటరీ తీసి ఎంపిక చేస్తాం. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వేర్వేరుగా ఎంపిక చేస్తాం. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తాం. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్‌ తెలిసిపోతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహిస్తాం. చాలా పారదర్శకంగా, పక్కాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశాం. కచ్చితంగా ఎలాంటి సమస్యా లేకుండా కౌంటింగ్‌ను పూర్తిచేస్తాం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం రావచ్చు. వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడిస్తాము. ఇ-సువిధ యాప్, ఈసీఐ వెబ్ సైట్‌లో ఎన్నికల ఫలితాలు చూడొచ్చు. ‘‘వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు తర్వాత తుది ఫలితం ప్రకటిస్తాం"అని ద్వివేది మీడియాకు వివరించారు.

రీ-పోలింగ్ అవకాశం చాలా తక్కువ!

"కౌంటింగ్‌ తర్వాత రీ పోలింగ్‌ జరిగే అవకాశం చాలా తక్కువ. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పాదర్శకంగా ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది" అని ద్వివేది తేల్చిచెప్పారు. సో.. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో..? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా కౌంటింగ్ జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.