close
Choose your channels

కొంతకాలం చూద్దాం... ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలకు ఏపీ హైకోర్టు ఓకే

Friday, May 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల తగ్గింపు, టికెట్ల ఆన్‌లైన్ విక్రయం, బెనిఫిట్ షోల రద్దు వంటి ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదనమైన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వంతో సినీపెద్దలు పలుమార్లు చర్చలు జరపడంతో జగన్ సర్కార్ మెత్తబడింది. ఈ మేరకు గత కొన్ని నెలలుగా విడుదలవుతున్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాల వ్యవహారం కోర్టు పరిధిలో వుండటంతో ఈ విషయంలో ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించింది హైకోర్టు

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సొంత వేదికలపై టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్లను విక్రయించేందుకు బుక్‌మై షో, పేటీఎం వంటి సంస్థలు అంగీకరించాయని, కానీ మల్టీప్లెక్స్‌ థియేటర్లు మాత్రం ముందుకు రావడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టికెట్‌ విక్రయ కార్యకలాపాలను ఏపీఎఫ్‌డీసీలో విలీనంచేస్తే తమకు అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయాల జీవో ఇచ్చామన్నారు. టికెట్ల విక్రయాల నుంచి తామెవరినీ తప్పించడం లేదని, ఏపీఎఫ్‌డీసీ ద్వారా విక్రయించాలని మాత్రమే చెబుతున్నామని ఏజీ వెల్లడించారు. దీని వల్ల ఒక్కో టికెట్‌ విక్రయించినందుకు ప్రభుత్వానికి రూ.1.97 సర్వీసు చార్జీ కింద వస్తుందని చెప్పారు.

అలాగే.. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తెచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్నాళ్లు చూద్దామని కోర్టు అభిప్రాయపడింది . దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించుకోవచ్చని వెల్లడించింది. ఈ అంశంలో మల్టిప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తదువరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.