close
Choose your channels

‘అర్జున్ రెడ్డి’ మూవీ చూసి లవర్‌ను చంపేశాడు.. !

Tuesday, October 15, 2019 • తెలుగు Comments

‘అర్జున్ రెడ్డి’ మూవీ చూసి లవర్‌ను చంపేశాడు.. !

జనాలపై సినిమాల ప్రభావం ఏ మాత్రం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాలే మార్చేస్తాయని చెప్పలేం కానీ.. సినిమాల వల్ల జనాలు ప్రభావితం అవుతారన్నది మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అలా సినిమాలు చూసి వెర్రెక్కి చిల్లర చేష్టలు చేసిన జనాలున్నారు.. అదే విధంగా సినిమాలు చూసి మంచి పనులు చేసిన జనాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా జరిగిన ఓ వ్యవహారం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ అయ్యింది.

‘అర్జున్ రెడ్డి’ సినిమా యూత్‌ను ఏ రేంజ్‌లో అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో అర్జున్ రెడ్డి సినిమా భాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సింగిల్ సినిమాతో అటు హీరో విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇద్దరి పేర్లు టాలీవుడ్‌లో మార్మోగడమే కాకుండా.. రేంజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే తాజాగా.. ఈ చిత్రం చూసి ఓ వ్యక్తి తన ప్రేమికురాలిని హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై సందీప్ వంగా స్పందిస్తూ.. అసలు తాను తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఎక్కడా హత్యలు చేయమని ప్రోత్సహించలేదని చెప్పాడు సందీప్‌రెడ్డి వంగా.

అసలేం జరిగింది..!?

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ పేరుతో వచ్చిన ఈ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌ టిక్‌టాక్‌ స్టార్‌ అశ్వని కుమార్‌ ఈ సినిమాకు విపరీతంగా ప్రభావితం అయ్యాడు. ఈ సినిమా చూసి నిఖిత అనే తన ప్రేయసిని హత్య చేయడం కలకలం రేపుతోంది. తాను ప్రేమిస్తున్న అమ్మాయికి రానున్న డిసెంబర్‌లో మరొకరితో పెళ్లి జరగబోతుందని తెలుసుకుని ఆమెను చంపేసాడు. ఈ కేసును నిశితంగా పరిశీలించిన పోలీసులు సినిమా ప్రభావం వల్లే ఇలా చేశాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. ఈ ఘటన అనంతరం తనకు తానుగా ఆ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆరా తీస్తే ఆయన టిక్ టాక్ వీడియోల్లో ఎక్కువగా కబీర్ సింగ్ డైలాగులు కనిపించాయి.. ఆమె నాకు దక్కని పక్షంలో.. మరొకరికి దక్కకూడదని అర్థం వచ్చేలా కొన్ని డైలాగులు టిక్‌టాక్‌లో ఉన్నాయి.

డైరెక్టర్ ఏమన్నారు..!?

‘నిఖితా శర్మకు జరిగిన అన్యాయం పట్ల చాలా బాధగా ఉంది. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నా పని తనానికి.. దాని ఫలితానికి బాధ్యత వహిస్తాను కానీ ఇతరుల్ని హత్య చేయమని నా సినిమాలు ఎప్పుడూ ప్రోత్సహించలేదు. నేను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి కానీ.. కబీర్ సింగ్ కానీ ఎవర్ని హత్య చేయమని చెప్పలేదని.. అలా ప్రోత్సహించే అలవాటు కూడా నాకు లేదు’ అని సందీప్ వంగా ఒకింత సారీ చెప్పే ప్రయత్నం చేశాడు.

కాగా.. సినిమాలు అనేవి ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కానీ.. వాటిని చూసి ప్రభావితం కాకూడదు.. మంచిని మాత్రమే తీసుకుని వీలైతే అలవర్చుకోవాలేగానీ.. చెడును ఎక్కువగా తీసుకుని అదే బాటలో నడవకూడదు. ఎంతైనా రీల్ రీలే.. రియల్ రియలే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సినీ విశ్లేషకులు, క్రిటిక్స్ సినీ ప్రియులకు సూచిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz