Download App

Athade Srimannarayana Review

బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమా సత్తా ప్ర‌పంచానికి తెలిస్తే.. కె.జి.య‌ఫ్ త‌ర్వాత క‌న్న‌డ సినిమా మార్కెట్ రేంజ్ ప‌దింత‌లు పెరిగింది. ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌లైన కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1 సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది. దీంతో చాలా మంది క‌న్న‌డ హీరోలు త‌మ సినిమాల‌ను పాన్ ఇండియా సినిమాలుగా విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ క్రమంలో విడుద‌లైన మ‌రో పాన్ ఇండియా క‌న్న‌డ చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. ర‌క్షిత్ శెట్టి, శాన్వి న‌టించిన ఈ సినిమా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రీ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు క‌థంటో చూద్దాం..

క‌థ‌:

అమ‌రావ‌తి ప్రాంతంలోని ఓ నిధిని కొంద‌రు నాట‌కాలు వేసేవాళ్లు దొంగ‌లిస్తారు. అయితే వారిని ఆ ప్రాంతానికి చెందిన దొర‌ రామ్‌రామ్ అభీర‌(మ‌ధుసూద‌న్‌) చంపేసి నిధిని సొంతం చేసుకోవాల‌నుకుంటాడు. కానీ వాళ్లు చ‌నిపోవ‌డానికి ముందే నిధిని ఓ ర‌హ‌స్య ప్రాంతంలో దాచేస్తారు. దాంతో రామ్ రామ్ ఆ నిధిని సొంతం చేసుకోకుండానే క‌ళ్లు మూస్తాడు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న స్థానానికి వారి కొడుకులిద్ద‌రూ పోటీ ప‌డ‌తారు. అయితే రామ్ రామ్ జ‌య‌రాం త‌న సోద‌రుడు తుకారాంను వెళ్ల‌గొట్టి కోట‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంటాడు. 15 ఏళ్లు గ‌డిచినా నిధి ర‌హ‌స్యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ స‌మ‌యంలో అక్క‌డకు శ్రీమ‌న్నారాయ‌ణ‌(రక్షిత్ శెట్టి) అనే పోలీస్ అధికారి వ‌స్తాడు. అత‌డు నిధిని గురించి అన్వేషిస్తుంటాడు. ఆ క్ర‌మంలో అత‌నికి ఎదుర‌య్యే స‌వాళ్లేంటి?  వాటిని శ్రీమ‌న్నారాయ‌ణ ఎలా ఛేదిస్తాడు?  చివ‌ర‌కు నిధి ఎవ‌రి ఆధీనంలో ఉంటుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

కౌబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో నిధి అన్వేష‌ణ జ‌రిగే క‌థ‌ల‌ను సినిమాల రూపంలో చూసేశాం. తాజాగా అలాంటి నేప‌థ్యంలో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. కౌబాయ్ కాన్సెప్ట్‌లో సాగే నిధి అన్వేష‌ణ‌లో డిఫ‌రెంట్ ఏంటంటే.. కల్పిత బ్యాగ్రౌండ్‌లో సినిమాను రూపొందించ‌డ‌మే. అమ‌రావ‌తి అనే క‌ల్పిత న‌గరాన్ని తీసుకున్నారు. ఆ న‌గ‌రానికి, నిధికి లింకు పెట్టి ద‌ర్శ‌కుడు స‌చిన్ క‌థ‌ను న‌డిపాడు. బేసిక్ పాయింట్‌ను దాన్ని తెర‌కెక్కించిన తీరులో కొన్ని అంశాలు బాగా ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే సినిమా ఆక‌ట్టుకోలేదు. ర‌క్షిత్ శెట్టి సినిమాను తానై ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న పాత్ర ప‌రంగా చిత్రీక‌ర‌ణ బాగా ఉంది. అభీర బ్యాక్‌డ్రాప్ బాగా ఉంది. ఆర్ట్ వ‌ర్క్‌, అజ‌నీష్ సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. అయితే నాట‌కాలు, ఆ బ్యాచ్ చుట్టూనే ఎక్కువ క‌థ‌ను న‌డ‌ప‌డం.. మ‌రి స్లో నెరేషన్ ప్రేక్ష‌కుడి ఓపిక‌ను ప‌రీక్ష పెట్టేదిలా ఉంది. సినిమా ద‌ర్శ‌కుడు, హీరో ఎడిట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింద‌నే చెప్పాలి. ఎందుకంటే సినిమాను అన‌వ‌స‌రం అయిన చోట ఎడిట్ చేయ‌కుండా సినిమాను న‌డిపించ‌డానికి ఆస‌క్తిని క‌న‌పరిచారు. ఇదే సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారింది. అలాగే సీరియ‌స్ సన్నివేశాల్లోనూ హీరో కామెడీ చేయ‌డానికి చేసే ప్ర‌య‌త్నం కూడా అబ్బో అనిపిస్తుంది. సినిమా మేకింగ్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్న సౌత్ మూవీ మేక‌ర్స్ దాన్ని మెయిన్ టెయిన్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో అది మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. ఇంకా బ‌ల‌మైన స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బావుండేది.

చివ‌ర‌గా.. ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేవాడు ఎవ‌డు?... 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌'

Rating : 2.5 / 5.0