‘ఆత్మ నిర్భర్ భారత్’ అనే ఎందుకు.. ప్యాకేజీ ఉద్దేశమేంటి..!?

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా మీట్ నిర్వహించి నిశితంగా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలు ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటే ఏమిటి..? ఈ పేరునే ఎందుకు పెట్టారు..? అసలు ఈ ప్యాకేజీ దేనికి ఉపయోగపడుతుంది..? ఈ ప్యాకేజీతో ఎవరికెంత లాభం వాటిల్లింది..? సామాన్యుడి సంగతేంటి..? మరీ ముఖ్యంగా రైతన్న సంగతేంటి..? అనే విషయాలను ఆర్థిక మంత్రి నిశితంగా మీడియా ముఖంగా దేశ ప్రజలకు వివరించారు.

ప్యాకేజీ ముఖ్య ఉద్ధేశ్యం ఇదీ..

‘‘వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించాక ఈ ప్యాకేజీ రూపకల్పన జరిగింది. ఇది దేశాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడుతుంది. ‘స్వీయ ఆధారిత భారతం’ అనే పేరుతో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించడం జరిగింది. పేదలు, వలసకూలీల ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేశాం. మొత్తం ఐదు మౌళిక సూత్రాలతో ఈ ప్రత్యేక ప్యాకేజీని తయారుచేయడం జరిగింది. ఆర్థిక, మౌళిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలు. భారత్ స్వయం సమృద్ధి సాధించే వరకూ సంస్కరణలు కొనసాగుతాయి. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యం. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందించాం. అందుకోసమే దీనికి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పేరు పెట్టాం. కరోనా మహమ్మారి ఇండియాలోకి వచ్చినప్పట్నుంచి అనగా.. గత 40 రోజులగా పీపీఈలు, వెంటిలేటర్లు స్వదేశంలోనే ఉత్పత్తి చేస్తున్నాం. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్‌కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తాం. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయి. ఇవాళ ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) లకు సంబంధించి ప్రకటిస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్ మీడియా ముఖంగా వెల్లడించారు.

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇలా..!

‘ప్రభుత్వ కొనుగోళ్లలో ఇకపై రూ. 200 కోట్ల వరకు ఏ సేకరణ అయినా దేశీయంగానే ఉంటుంది. రూ. 200 కోట్ల లోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద 41 కోట్ల జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లను బదిలీ చేశాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల నిధులను విడుదల చేస్తాం. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 90 వేల కోట్ల సాయాన్ని అందిస్తాం. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6 నెలల గడువును పెంచుతున్నాం. పూర్తయిన పనుల స్థాయిని బట్టి బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కాంట్రాక్టర్లకు లభ్యత కొరత కొంత వరకు తగ్గుతుంది’ అని ఆర్థిక మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.