శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేశ్‌పై దాడి!
- IndiaGlitz, [Friday,February 14 2020]
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పలు హిందూ సంఘాలు, పలువురు నగరంలోని పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారో లేదని అనుకున్నారేమో కానీ.. రంగంలోకి దిగిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఇవాళ ఆయనపై దాడికి దిగారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో సినిమా చూసి బయటికి వస్తుండగా ఆయన కారును అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. అటు నుంచే అటే నేరుగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కత్తి మహేశ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన సైఫాబాద్ పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఆ ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము ఈ దాడికి పాల్పడినట్లు భజరంగ్‌దళ్ కార్యకర్తలు వెల్లడించారు.
ఇంతకీ కత్తి ఏమన్నాడు!?
ఇటీవల ఓ కార్యక్రమంలో కత్తి మాట్లాడుతూ.. ‘శ్రీరాముని ఫేవరెట్ వంటకం జింక మాంసం. సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది.. వండుకుని తినడానికే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు ఉండేవారు’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదే కార్యక్రమంలో.. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు, హిందువులు ఖండించినప్పటికీ.. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
నేను భయంకరమైన హిందువును!
అంతటితో ఆగని ఆయన.. ‘నేను భయంకరమైన హిందువును. దేన్నీ గుడ్డిగా ఫాలో కాబోను. మీకు సందేహాలుంటే వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలి’ అని విమర్శకులకు బదులిచ్చాడు. అయితే.. 2018లోనూ రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితం.. ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈసారి నాలుగైదేళ్ల పాటు నగర బహిష్కరణ చేయాలని హిందూ సంఘాలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.