అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే ఇవాళ అనగా శనివారం నాడు.. 12 ఏళ్ల తర్వాత అయేషా మృతదేహానికి రీ-పోస్టుమర్టం నిర్వహించారు. సుమారు ఆరు గంటలకు పైగా.. అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి జరిగింది. అయితే మృతదేహాన్ని వెలికితీసి నిశితంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి.. ఆనవాళ్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు.. పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించింది. కాగా.. ఈ హత్యకేసును సీబీఐ సీరియస్‌గా విచారణ చేస్తోంది. శవపరీక్ష పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రిపోర్ట్‌ను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించడం జరిగింది. అయేషా ఎముకల నుంచి అవశేషాలు సేకరించి.. అనంతరం సీబీఐ ఎస్పీ నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. 2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అయితే ఈ కేసులో అప్పట్లో బడా బాబుల పిల్లలు, మనువళ్లు ఉండటంతో ఇన్ని రోజులు నాన్చుతూనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకూ ఈ కేసు ఎన్ని మలుపులో తిరిగిందో అర్థం కాని పరిస్థితి.