కేటీఆర్‌తో భేటీ సరే.. కారెక్కెదెప్పుడు అజార్!?

  • IndiaGlitz, [Saturday,September 28 2019]

టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గెలుపు వెనుక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారని.. ఆయనే అంతా చూసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. ఆయన కారెక్కుతారని గత 24 గంటలుగా వార్తలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాడు మంత్రి కేటీఆర్‌ను అజార్ కలిశారు. అంతేకాదు త్వరలోనే సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. కేటీఆర్‌తో భేటీ ద్వారా అజారుద్దీన్ టీఆర్ఎస్‌లో చేరికకు సంకేతాలిచ్చినట్టయ్యిందని చెప్పుకోవచ్చు.

కారెక్కేందుకే ఇవన్నీ..!
ఇదిలా ఉంటే.. వాస్తవానికి తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు నుంచే అజార్ కారెక్కాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అప్పట్లో వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు సమయం ఆసన్నం కావడం, అధ్యక్ష ఎన్నికల్లో కేటీఆర్ సాయం చేయడం.. ఇవన్నీ చేరికను కన్ఫామ్ చేసేశాయని తెలుస్తోంది. అంతేకాదు.. హెచ్ఏసీ ఎన్నికల్లో తనకు మద్దతునిస్తే.. గెలిచాక టీఆర్ఎస్‌లో చేరుతానని అజారుద్దీన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ఇచ్చిన మాట మేరకు అజారుద్దీన్ ఆ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

భేటీ అనంతరం..!
‘యువత నైపుణ్యాన్ని గుర్తించి క్రికెట్‌లోకి తెస్తాము. క్రికెట్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని కేటీఆర్‌ను కోరాను. క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి సహకారం కోరతాం. పార్టీలకతీతంగా అందర్నీ కలిసి సహకారం కోరతాం’ అని కేటీఆర్‌తో భేటీ అనంతరం అజార్ చెప్పుకొచ్చారు.

రేపో.. మాపో పక్కాగా!
ఇన్ని మాటలు చెప్పిన అజార్.. కారెక్కడంపై మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.. అయితే కారెక్కడం పక్కా కానీ.. ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదని సమాచారం. మొత్తానికి చూస్తే.. రేపో మాపో ఆయన టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమే అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈయన నిజంగానే పార్టీలో చేరుతారా..? ఒక వేళ చేరితో అజార్ స్థానమేంటి..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.