Download App

Babu Baga Busy Review

అష్టాచ‌మ్మాతో ఇద్ద‌రి హీరోల్లో ఒక‌డిగా ఎంట్రీ ఇచ్చిన అవ‌స‌రాల శ్రీనివాస్ న‌టుడుగా మంచి పాత్ర‌ల్లో మెప్పించాడు. కామెడి పాత్ర‌ల్లో కూడా న‌టించాడు. ఇప్పుడు `బాబు బాగా బిజీ` చిత్రంతో హీరోగా మారాడు. త‌ను చేసే పాత్ర‌ల్లో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉండాల‌నుకుంటానని చెప్పిన అవ‌స‌రాల స్పైసీ కంటెంట్‌తో రూపొందిన బాలీవుడ్ మూవీ తెలుగు రీమేక్‌లో న‌టించాల‌నుకోవ‌డ‌మే పెద్ద సాహ‌సం అనుకోవాలి. హంట‌ర్ రీమేక్‌లో అవ‌స‌రాల న‌టిస్తాడ‌ని న్యూస్ బ‌య‌ట‌కు రాగానే ఇప్ప‌టి వ‌ర‌కు కుటుంబ క‌థా చిత్రాల న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా ముద్ర వేసుక‌న్న అవ‌స‌రాల ప్లేబోయ్ రోల్ చేయ‌డ‌మేంట‌ని చాలా మంది అనుకున్నారు. అస‌లు ప్లేబోయ్ పాత్ర‌లో అవ‌స‌రాల ఎలా చేస్తాడోన‌ని చాలా మంది ఆస‌క్తిగా `బాబు బాగా బిజీ` సినిమా కోసం ఎదురుచూశారు. మ‌రి అవ‌స‌రాల బాబు అమ్మాయిల‌ను ట్రాప్ చేయ‌డంలో ఎంత బిజీగా ఉన్నాడు?, అస‌లు ప్లేబోయ్ గెట‌ప్‌లో ఎలా మెప్పించాడు? అస‌లు హంట‌ర్ కంటే బాబు బాగా బిజీ బావుందా?  లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థః

మాధ‌వ్‌(అవ‌స‌రాల శ్రీనివాస్‌), వ‌ర‌ప్ర‌సాద్‌(ప్రియ‌దర్శి), ఉత్తేజ్‌(ర‌విప్ర‌కాష్‌) లు చిన్న‌ప్ప‌ట్నుంచి ప్రాణ స్నేహితులు. ముగ్గుర‌లో మాధ‌వ్‌కు అమ్మాయిలంటే చిన్న‌ప్ప‌ట్నుంచి ఆక‌ర్ష‌ణ ఉంటుంది. అమ్మాయిల‌ను, అంటీల‌ను ట్రాప్ చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తోనే  ఉండే మాధ‌వ్ కొంద‌రితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తుంటాడు. త‌న వ‌ల్ల అమ్మాయిల‌కు, అంటీల‌కు ఇబ్బంద‌లు వ‌స్తే మాధ‌వ్ పారిపోయే ర‌కం. మాధ‌వ్ జీవితం ఇలా సాగిపోతుండుగా మాధ‌వ్ త‌ల్లిదండ్రులు రాధ‌(మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి)తో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. రాద కూడా మాధ‌వ్‌కు బాగా న‌చ్చేస్తుంది. కానీ త‌న‌కు అమ్మాయిల పిచ్చి ఉంద‌ని తెలిస్తే రాధ త‌న‌ను విడిచి ఎక్క‌డ వెళ్ళిపోతుందోన‌ని కూడా భ‌య‌ప‌డుతూ ఏదో ఒక‌లా మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఓ ఘ‌ట‌న మాధ‌వ్‌లో పెద్ద మార్పు తీసుకొస్తుంది. అదేంటి?  మాధ‌వ్ రాధ‌కు త‌న గురించిన‌ నిజం చెప్పాడా?  రాధ చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

- న‌టీన‌టులు ప‌నితీరు
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

- క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం
- సంగీతం
- ఎడిటింగ్‌

విశ్లేష‌ణ:

రీమేక్ చేయాలంటే క‌థ‌లోని సోల్‌తో పాటు, క‌థ‌లోని ఎమోష‌న్స్‌ను కూడా స‌రిగ్గా క్యారీ చేస్తేనే బావుంటుంది. ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం ఆ విష‌యంలో పెద్దగా స‌క్సెస్ కాలేదు. సినిమా స్క్రీన్‌ప్లే మారినా సినిమాలో నెమ్మ‌దిత‌త్వం ప్రేక్ష‌కుడిని సీట్లో కూర్చోనివ్వ‌దు. స్పైసీ డైలాగ్స్, సీన్స్‌తో ఉండే హిందీ మూవీని తెలుగులో తీయాల‌నుకోవ‌డం పెద్ద సాహ‌స‌మే,  క‌థ‌లోని మెయిన్ కంటెంట్ అదే అయిన‌ప్పుడు దాన్ని ప‌క్క‌న పెట్టి సినిమాను రీమేక్ చేయ‌డం వల్ల ఎమోష‌న్స్ స‌రిగ్గా క్యారీ కాలేదు. సురేష్ భార్గ‌వ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సీన్‌ను త‌న కెమెరాతో చ‌క్క‌గానే పిక్చ‌రైజ్ చేశాడు. సునీల్‌క‌శ్య‌ప్ ట్యూన్సీ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించ‌లేదు. ఉద్ధ‌వ్ ఎడిటింగ్ అస‌లు బాలేదు. సినిమా స్లోగా సాగుతున్న‌ట్లు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌స‌రాల శ్రీనివాస్ న‌టుడుగా మాత్ర‌మే అంద‌రికీ తెలుసు. బాబుబాగా బిజీలో పూర్తి స్థాయి హీరో పాత్ర చేశాడు. అయితే అవ‌స‌రాల పూర్తి స్థాయి ప్లేబోయ్ రోల్‌లో మెప్పించలేక‌పోయాడు. అయితే క్యారెక్ట‌ర్ ప‌రంగా ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌స‌రాల చేసిన పాత్ర‌ల‌కు డిఫ‌రెంట్ పాత్ర‌తో ఈ సినిమాలో క‌నిపించాడు.  అవ‌స‌రాల చేసిన అటెంప్ట్‌ను అభినందించాల్సిందే. అవ‌స‌రాల స్నేహితుల పాత్ర‌ల్లో న‌టించిన ప్రియ‌ద‌ర్శి, ర‌విప్ర‌కాష్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మిస్తీ చ‌క్ర‌వర్తి పాత్ర‌లో ఓకే అనిపించింది. తేజ‌స్వి, సుప్రియ అంద‌రూ కూడా వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు. హిందీ వెర్ష‌న్‌లో మూవీలో ఉన్న స్పీడు తెలుగులో క‌న‌ప‌డ‌దు. మొత్తం మీద బాబు ఇటు క్లాసు, అటు మాసు ప్రేక్ష‌కుల ఆక‌ట్టుకోలేక మ‌ధ్య‌లోనే ఆగిపోయాడ‌నిపించింది.

బోట‌మ్ లైన్: బాబు... మ‌ధ్య‌లో ఊగిస‌లాడాడు

Babu Baga Busy English Version Review

Rating : 2.0 / 5.0