బాల‌య్య‌.. వ‌రుస‌గా వారితోనే

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

వందకి పైగా సినిమాలలో నటించినా ఇంకా అదే జోరును కొనసాగిస్తూ నేటితరం హీరోలకి పోటీనిస్తున్నారు సీనియర్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. అయితే.. 'లెజెండ్' సినిమా తర్వాత కెరీర్‌లో అంతకు ముందు పని చేయని దర్శకులతో వరుస సినిమాలను చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 'లెజెండ్' తర్వాత వచ్చిన 'లయన్' (సత్యదేవ్), 'డిక్టేటర్' (శ్రీవాస్), 'గౌతమిపుత్ర శాతకర్ణి' (క్రిష్), 'పైసా వసూల్' (పూరి జగన్నాథ్), 'జై సింహా' (కె.ఎస్.రవికుమార్) చిత్రాల కోసం వ‌రుస‌గా ఇంత‌కుముందు పని చేయని డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేసారు బాలకృష్ణ. అయితే ప్ర‌స్తుతం.. ఆ సంప్ర‌దాయానికి కొంత బ్రేక్ ఇచ్చి గ‌తంలో త‌న‌తో క‌ల‌సి పనిచేసిన ద‌ర్శ‌కుల‌తో మ‌ళ్ళీ వ‌రుస సినిమాలు చేయ‌డానికి సిధ్ధ‌ప‌డ్డారు ఈ నందమూరి హీరో.

]వారిలో ముందుగా వి.వి.వినాయక్ ('చెన్నకేశవరెడ్డి') సినిమా త్వ‌ర‌లో పట్టాలెక్కనుంది. అలాగే.. బోయపాటి శ్రీను ('సింహా', 'లెజెండ్') దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుండ‌గా.. మహానటుడు ఎన్.టి.రామారావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న 'ఎన్.టి.ఆర్' మూవీకి క్రిష్ ('గౌతమీపుత్ర శాతకర్ణి') దర్శకత్వం వహించనున్నారు. ఈ ముగ్గురూ కూడా గ‌తంలో బాలకృష్ణతో సినిమాలు చేసి విజయాన్ని అందుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మూడు సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.