close
Choose your channels

బాలయ్య ఎందుకిలా చేశావయ్యా..!?

Tuesday, February 12, 2019 • తెలుగు Comments

బాలయ్య ఎందుకిలా చేశావయ్యా..!?

రాష్ట్ర విభజనాంతరం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని మోదీ సర్కార్ మోసం చేసిందని సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు దాదాపు ఏపీలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. మరికొందరు వారివారి నియోజకవర్గాల్లో చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఆందోళన, నిరసనలతో హోరెత్తించారు. అయితే అందరూ ఇన్ని చేస్తున్నా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఎక్కడా కనిపించలేదు.. ఆయన గొంతు వినిపించలేదు..!. ఆయన దీక్షకు రాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య హాట్ టాపిక్ అయ్యారు. మరీ ముఖ్యంగా హిందూపురంలో సొంత పార్టీ నేతలు సైతం బాలయ్య ఎందుకిలా చేశారబ్బా అని ఒకింత విస్మయానికి గురయ్యారట.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గతంలో ఓ బహిరంగ సభావేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో బాలయ్య విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పట్లో ఆయన మాట్లాడిన సగం ఇంగ్లీష్.. సగం హిందీ మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి.. మరిచిపోదామన్నా మరవలేరు కూడా.!. ఢిల్లీలో జరిగే సభకు బాలయ్య కచ్చితంగా హాజరవుతారు.. మోదీ, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దుమ్ముదులుపుతారని అటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అందరూ భావించారు. అయితే ఆయన రాకపోవడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి.

మహానాయకుడులో బాలయ్య షూటింగ్‌‌లో ఉన్నారని అందుకే దీక్షకు హాజరుకాలేకపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఎంపీ అయినప్పటికీ ఆ పార్టీ విధివిధానాలు నచ్చక తిరుగుబాటు చేస్తున్న శత్రుఘ్న్‌సిన్హా  బాబు దీక్షకు మద్దతిచ్చి మోదీ తీరును ఎండగట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అంతేకాదు నిన్నగాక మొన్న తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న యామిని సాధినేని, దివ్యా వాణిలు సైతం దీక్షకు హాజరయ్యారు. యామిని భరతమాత వేషంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాగా.. దివ్య తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నారు. మరోవైపు హీరో శివాజీ సైతం దీక్షలో చంద్రబాబును ఆకాశానికెత్తుతూ.. మోదీపై విమర్శల వర్షం కురింపచారు.. కనీసం వారికున్న బాధ్యత కూడా బాలయ్య బాబుకు లేకపోతే ఎలా అంటూ విమర్శకులు, పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పోనీ షూటింగ్ ఉందనుకుంటే.. ఒక రోజు ఆపొచ్చు అదేం పాచిపోయేది కాదు కదా..! ఆ లెక్కన పెట్టుకుంటే శత్రుఘ్న్ సిన్హా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన దీక్షకు వచ్చారు. దీక్షకు అలా వచ్చి.. ఇలా వెళ్లి పోవచ్చు కానీ ఆయనేం పోలేదు.. దీక్ష పూర్తయ్యేంత వరకు ఉండి అందరి మన్ననలు పొందారు. అలాంటిది షూటింగ్‌‌కు ఒకరోజు బ్రేక్ చెప్పి రాకపోవడం గమనార్హం. దీంతో అటు నెటిజన్లు ఇటు పలువురు విమర్శకులు బాలయ్య తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన రాకపోయినప్పటికీ హిందూపురంలో అయినా నిరసన కార్యక్రమాలు చేపట్టారా..? అంటే అది కూడా శూన్యమే మరి. స్వయానా వియ్యంకుడు, టీడీపీ అధినేత దీక్ష చేస్తే రాకపోవడం వెనుక ఏదో బలమైన కారణమేదో ఉండొచ్చని టీడీపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఈ విషయంపై బాలయ్య మీడియా ముందుకు వచ్చి కాసింత క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో..! 

Get Breaking News Alerts From IndiaGlitz