బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. మ‌రోసారి అలాగే!

  • IndiaGlitz, [Monday,March 26 2018]

'అల్లుడు శీను' చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. గ‌త ఏడాది 'జ‌య‌జాన‌కినాయ‌క‌'తో ప‌ల‌క‌రించారు. ప్రస్తుతం 'సాక్ష్యం'తో బిజీగా ఉన్నారు. మే 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించింది. ఇదే రోజు 'రాజుగాడు' గా థియేటర్లలో సందడి చేయడానికి రాజ్ తరుణ్ సిద్ధంగా ఉండగా.. డాషింగ్ డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్ తన తనయుడు పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'మెహబూబా'ను విడుదల చేస్తున్నారు.

అంటే.. ఒకే రోజు మూడు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయ‌న్న‌మాట‌. ఇటువంటి పోటీనే గత ఏడాది కూడా ఎదుర్కొన్నారు శ్రీనివాస్. గత ఏడాది ఆగష్టు 11న యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'జయ జానకి నాయక' తో శ్రీనివాస్ ఆడియన్స్ ముందుకు వచ్చారు.

అదే రోజు హను రాఘవపూడి, నితిన్ కలయికలో 'లై' చిత్రం విడుదల కాగా.. 'నేనే రాజు నేనే మంత్రి'  అంటూ రానా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అప్పుడు ఈ పోటీలో రానా విజయం సాధించగా.. శ్రీనివాస్ న‌టించిన 'జయ జానకి నాయక' సినిమా మిశ్రమ స్పందనతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మరి ఈసారి పోటీలోనైనా.. సాలిడ్ హిట్‌తో శ్రీనివాస్ విజయాన్ని అందుకుని పైచేయి సాధిస్తారేమో చూడాలి.