close
Choose your channels

2021లో యూట్యూబ్ ని ఊపేసిన సాంగ్స్

Monday, June 21, 2021 • తెలుగు Comments

ఇప్పటి వరకు 2021లో కొన్ని పాటలు యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఆ పాటల వివరాలు తెలుసుకుందాం.

లవ్ స్టోరీ - సాయి పల్లవి సారంగదరియా

అదేమీ మ్యాజిక్కో కానీ సాయి పల్లవి డాన్స్ చేస్తూ కనిపిస్తే కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఇటీవల ఈ చిత్రంలో 'సారంగ దరియా' అనే ఫోక్ స్టైల్ లో సాగే పాటని రిలీజ్ చేశారు. కొన్ని రోజుల్లోనే యూట్యూబ్ లో సునామీ మొదలైంది. ఈ సాంగ్ విడుదలైన మూడు నెలల్లోనే యూట్యూబ్ లో 248 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మంచి బీట్ తో సాగే పాట ఒకెత్తయితే.. కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టేలా సాయి పల్లవి డాన్స్ మరో ఎత్తు. దీనికి తోడు మంగ్లీ మ్యాజిక్ వాయిస్.. ఇక సునామి రాకుండా ఎలా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. పవన్ సిహెచ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది.

శశి - సిద్ శ్రీరామ్ పాడితే రికార్డులే

యంగ్ హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన చిత్రం శశి. సినిమా నిరాశపరిచినప్పటికీ ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' అనే సాంగ్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సాంగ్ లిరికల్ వీడియో 122 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. తన సమ్మోహనమైన గాత్రంతో సిద్ శ్రీరామ్ పాడిన మరో సూపర్ హిట్ సాంగ్ ఇది. అరుణ్ సంగీత దర్శకుడు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

ఉప్పెన - యూట్యూబ్ వ్యూస్ 'జలపాతం'లా..

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డెబ్యూ హీరో చిత్రాలలో రికార్డ్ మూవీగా నిలిచింది. దేవిశ్రీ అందించిన పాటలు ఈ చిత్రాన్ని మరో లెవల్ కు చేర్చాయి. అన్ని పాటలు ఆకట్టుకోగా మరీ ముఖ్యంగా 'జలపాతం' అనే సాంగ్ ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. 73 మిలియన్ వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతోంది.

శ్రీకారం - భలేగుంది బాల

శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం శ్రీకారం. ఈ ఏడాది విడుదలై పర్వాలేదనిపించుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ ఓకె అనిపించుకున్నాయి. అయితే ఈ చిత్రంలో వాడుకున్న ఫోక్ సాంగ్ 'భలేగుంది బాల' ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో 73 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతోంది. అయితే ఈ సాంగ్ ని కొన్ని నెలల క్రితమే విడుదల చేశారు.

జాతి రత్నాలు - 'చిట్టి' ఈ పేరే పెద్ద మ్యాజిక్

యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి నటించిన జాతి రత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కావలసిన పూర్తి స్థాయి వినోదం అందించింది. మ్యూజిక్ విషయానికి వస్తే రధాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మధ్య సాగే లవ్ ట్రాక్ సాంగ్ 'చిట్టి' సూపర్ హిట్ గా నిలిచింది. చిట్టి అనగానే ది రోబోట్ అంటూ రజిని గుర్తుకు వస్తారు. ఈ చిట్టి సాంగ్ కూడా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. 72 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ కోసం రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ గమ్మత్తుగా ఉంటాయి.

క్రాక్ - భూమ్ బద్దల్

మాస్ మహారాజ్ రవితేజ చాలా కలం తర్వాత తన బాక్సాఫీస్ సత్తా చాటిన చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయింది. తమన్ సంగీతం అందించిన పాటలు మాస్ కు బాగా చేరువయ్యాయి. ముఖ్యంగా భూమ్ బద్దల్ అనే స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో 61 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ అప్సర రాణి అందాలు హైలైట్ గా నిలిచాయి. మాస్ బిర్యానీ అనే సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది.

ఆచార్య - లాహే లాహే

మెగాస్టార్ చిరంజీవి అంటే బహుశా మణిశర్మకు పూనకం వస్తుందేమో. చాలా కాలం తర్వాత మణిశర్మ, చిరంజీవి కాంబోలో వస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. ఆ మధ్యన విడుదల చేసిన 'లాహే లాహే' అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. శివ పార్వతుల మధ్య రొమాన్స్ ని వర్ణిస్తూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ సాంగ్ 57 మిలియన్ వ్యూస్ సాధించింది.

వకీల్ సాబ్ - మ్యూజిక్ తో తమన్ మ్యాజిక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఘనవిజయం సాధించింది. సినిమాలో పవన్ పెర్ఫామెన్స్ హైలైట్. మ్యూజిక్ పరంగా తమన్ సంచలనం సృష్టించాడు. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్, బ్యాగ్రౌండ్ సంగీతం స్పెషల్ గా నిలిచాయి. మగువా మగువా సాంగ్ ఒక సెన్సేషన్ అయితే ఈ ఏడాది విడుదలైన కంటిపాప సాంగ్ యూట్యూబ్ లో 36 మిలియన్ వ్యూస్ సాధించింది.

రెడ్ - మాస్ 'డించాక్'

రామ్ నటించిన రెడ్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలోని డించాక్ అనే స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు 28 మిలియన్ల వ్యూస్ దక్కాయి. మణిశర్మ సంగీత దర్శకుడు. హెబ్బా పటేల్ అందాలు, రామ్ స్టెప్పులు ఈ సాంగ్ లో హైలైట్.

సీటీమార్ - జ్వాలా రెడ్డి

యాక్టన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం సీటిమార్. సంపత్ నంది దర్శకుడు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'జ్వాలా రెడ్డి' అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాట 19 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

నల్లమల - ఏమున్నావే పిల్ల

బిగ్ బాస్ ఫేమ్ అమిత్, భానుశ్రీ నటించిన నల్లమల చిత్రంలోని ఏమున్నావే పిల్ల సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

విరాటపర్వం - కోలు కోలు

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో కోలుకోలోయమ్మ అనే సాంగ్ యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. చంద్రబోస్ సాహిత్యం అందించారు.

Get Breaking News Alerts From IndiaGlitz