close
Choose your channels

టీడీపీ పై భూమా ఫ్యామిలీ తిరుగుబాటు.. త్వరలో జంప్ !?

Tuesday, January 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భూమా ఫ్యామిలీ.. టీడీపీ సర్కార్‌‌పై తిరుగుబాటు చేస్తోందా..! ఇన్నాళ్లు అంతా మంచిగా ఉండి మంత్రి పదవి అనుభవించిన భూమా అఖిల ప్రియ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఎందుకిలా చేస్తున్నారు..? అక్క బాటలోనే నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎందుకు నడుస్తున్నారు..? అనే విషయాలను నిశితంగా గమనిస్తే తెలుగుదేశంపై తిరుగుబాటు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.!

ఇక అసలు విషయానికొస్తే.. జనవరి 3న ఆళ్లగడ్డలోని పలువురి ఇళ్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో తన అనుచరులు ఇళ్లలో కూడా ఉన్నాయి. మా అనుచరులు, కార్యకర్తలు ఇళ్లలోనే పోలీసులు సెర్చ్ చేశారు. ఈ వ్యవహారాన్ని పలువురు అనుచరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. తనకు ప్రభుత్వం ఇచ్చిన గన్‌‌మెన్లను వెనక్కి పంపి.. పోలీసు బందోబస్తును కూడా తిరస్కరించడం జరిగింది. గత ఐదు రోజులుగా జన్మభూమి కార్యక్రమాల్లో ఎలాంటి భద్రత లేకుండానే ఆమె పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ.. అక్కే వద్దనుకున్నప్పుడు ఇక నాకెందుకు అనుకున్నాడేమో గానీ సర్కార్ తనకిచ్చిన గన్‌మెన్లను వెనక్కి పంపించేశారు. అయితే ఇంత తతంగం జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు గానీ కనీసం హోం మంత్రిగానీ స్పందించకపోవడం గమనార్హం.

మంత్రి అయ్యుండి ఆ మాత్రం తెలియకపోతే ఎలా!?

కార్డెన్ సెర్చ్ అనేది పోలీసులకు అనుమానం వచ్చినప్పుడు.. లేదా ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు తనిఖీలు చేయడం మామూలే. అయితే భూమా ఫ్యామిలీ మాత్రం.. దేశంలో మొట్టమొదటిసారిగా ఆళ్లగడ్డలోనే ఈ సెర్చ్‌‌లు జరుగుతున్నాయని నిరసనలు తెలపడం వాళ్లకే చెల్లుతుందేమో. బహుశా ఇలా కార్డెన్ సెర్చ్‌ను వ్యతిరేకించిన ఏకైక మంత్రి అఖిలనే అయ్యుండొచ్చు.! హైదరాబాద్, ముంబై లాంటి పెద్ద నగరాల్లో వారానికి కనీసం నాలుగు సార్లయినా చేస్తారు.. మరి ఏ ఒక్క మంత్రీ, ఎమ్మెల్యే ఆఖరికి కార్పొరేటర్ స్థాయి వ్యక్తి గానీ రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలిపిన దాఖలాల్లేవ్. అలాంటిది మంత్రి స్థాయిలో ఉన్న అఖిలకు కార్డెన్ సెర్చ్ ఎందుకు.. ఎప్పుడు చేస్తారనే విషయాలపై కనీస అవగాహన లేకపోవడమేంటని ఆమె తీరును పలువురు ప్రముఖులు, నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

అసలు కథ ఇదా అఖిలమ్మా..!

గత కొద్దిరోజులుగా టీడీపీ నేత, భూమా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వ్యక్తి అయిన ఏవీ సుబ్బారెడ్డి-అఖిల మధ్య పెద్ద ఎత్తున వివాదాలున్నాయి. ఈ తరుణంలో నంద్యాల లేదా ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి చంద్రబాబు దగ్గర తిష్టవేసి కూర్చుకున్నారు ఏవీ సుబ్బారెడ్డి. అప్పట్లో అఖిల- ఏవీ ఇద్దరూ బలబలాలు ప్రదర్శించుకునేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే భూమా ఫ్యామిలీ నుంచి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయట. ఓ వైపు ఏవీ సుబ్బారెడ్డి నుంచి ఇబ్బందుల.. మరోవైపు ఎస్వీ సుబ్బారెడ్డి నుంచి రోజుకో ప్రకటనలు వస్తుండటంతో ఇక టీడీపీ నుంచి తమకు టికెట్లు రావడం కష్టమని బ్రహ్మానందరెడ్డి, అఖిల భావించారట. అందుకే అప్పట్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న అఖిలమ్మపై ఆమె అంటే గిట్టని వాళ్లు పనిగట్టుకుని మరీ ఈ కార్డెన్ సెర్చ్ పేరుతో అనుచరులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని భూమా అభిమానులు చెప్పుకుంటున్నారు.

జనసేనలోకి జంప్ అవుతారా..!?

టికెట్ ఇవ్వకపోవతే అవసరమైతే పార్టీ మారి కేడర్‌ను కాపాడుకోవాలని భావించిన భూమా ఫ్యామిలీ టికెట్ హామీ ఇస్తే జనసేన లేదా తిరిగి సొంతగూడైన వైసీపీలోకి వెళ్లడానికి కూడా ఏ మాత్రం వెనకాడకూడదన్న యోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే నంద్యాల ఎమ్మెల్యే టికెట్ బ్రహ్మానందరెడ్డికి ఇస్తామని పలువురు జనసేన నేతలు ఆయన్ను సంప్రదించినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. అదే మాదిరిగా ఆళ్లగడ్డ కూడా భూమా ఫ్యామిలీకే ఇస్తామని కూడా జనసేన నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అభిమానులు, అనుచరులతో నిశితంగా చర్చించి త్వరలో కీలక నిర్ణయం తీసుకోవాలని భూమా ఫ్యామిలీ యోచిస్తోందట. అయితే ఈ పార్టీ మార్పు.. కార్డెన్ సెర్చ్ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది..? భూమా ఫ్యామిలీకి టీడీపీ న్యాయం చేస్తుందా..? లేదా? అనే విషయాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.