close
Choose your channels

రాధా రాజీనామా వెనుక పెద్ద కథే ఉందిగా!

Monday, January 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాధా రాజీనామా వెనుక పెద్ద కథే ఉందిగా!

వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆదివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత ఐదు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్న వస్తున్న రాధా ఎట్టకేలకు జనవరి 20న రాజీనామా చేసేశారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారు..? అసలు ఆయన రాజీనామా చేశారా.. లేకుంటే అధిష్టానమే రాజీనామా చేసేలా ఇబ్బంది పెట్టిందా..? రాధాకు-వైసీపీకి వ్యవహారం ఎక్కడ చెడింది..? అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం.

అదే నియోజకవర్గమే..!
2014 ఎన్నికల్లో  విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా ఓటమిపాలయ్యారు. కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం గనుక ఇక్కడ్నుంచి అయితే కచ్చితంగా గెలుస్తారని భావించిన వైసీపీ బరిలోకి దింపింది. అయితే ఊహించని రీతిలో రాధా ఓడిపోయారు.. మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు హై కమాండ్ సిద్ధమైంది కూడా. అంతేకాదు ఇటీవల వైసీపీ తరఫున నిర్వహించిన కొన్ని సర్వేలు సైతం రాధాకు అనుకూలంగా రావడం గమనార్హం. అయితే ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ రాధా మాత్రం బేఖాతరు చేయకుండా తాను పట్టిన కుందేలు అన్నట్లుగా విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని తిష్టవేసి కూర్చున్నారు. పైగా రాధా కూడా తూర్పును పట్టించుకోకుండా 2015 నుంచే సెంట్రల్‌‌పై పట్టు పెంచుకున్నారు. దీంతో ఇక్కడ్నుంచే పోటీ చేస్తే సానుకూల పవనాలు వీస్తాయని ఆయన భావించారు. అయితే అధిష్టానం ఆదేశాలతో సీన్ మొత్తం రివర్స్ అయింది.. అది కాస్త రాజీనామా దాకా చేరింది.

సెంట్రల్ సంగతేంటి..?
2014 ఎన్నికల్లో ఈ సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున బోండా ఉమా మహేశ్వరరావు.. వైసీపీ నుంచి పి గౌతమ్‌‌రెడ్డి పోటీచేశారు. గౌతమ్‌‌పై 27వేలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో బోండా విజయ డంఖా మెగించారు. ఆ తర్వాత గౌతమ్ రెడ్డి.. వంగవీటిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మళ్లీ తిరిగి చేర్చుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే గౌతమ్ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సెంట్రల్‌‌పై ఓ లుక్కేసుకున్న రాధా.. నియోజకవర్గం అంతా తనదే అనిపించుకునేట్లుగా‌‌ జనాల్లో తిరిగారు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా తనదే సీటు అని అందరూ అనుకున్నారు.. ఈయనకు ఇస్తే టీడీపీ ప్యాకప్ అంతేనని అప్పట్లో గట్టిగానే వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇదే టైమ్‌‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మల్లాది విష్ణు.. వైసీపీలో చేరడంతో రాధాకు అసంతృప్తితో రగలిపోయారు. నాటి నుంచి నేటి వరకూ మల్లాదికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదని.. మనకు ఇక పార్టీలో మనుగడ కష్టమేనని భావించిన రాధా.. సుమారు ఐదు నెలలపాటు ఓపిక పట్టానని అయితే అధిష్టానం పట్టించుకోకపోగా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో రాజీనామా చేయాలని భావించారు.

వంగవీటి వర్సెస్ మల్లాది..!
టికెట్ వ్యవహారంపై స్పష్టమైన హామీ ఇచ్చి మరీ మల్లాది వైసీపీలోకి చేర్చుకున్నారని అప్పట్లో టాక్. కొద్దిరోజుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు, లెక్కలన్నీ బేరీజు చేసుకున్న వైసీపీ ఎక్కడెక్కడ ఎవర్ని నిలబెట్టాలని అభ్యర్థులను అప్పడప్పుడు లీక్స్ చేస్తూ వస్తోంది. దీంట్లో సెంట్రల్ నుంచి మల్లాది.. తూర్పు నుంచి వంగవీటి రాధాను పోటీ చేయించాలని హైకమాండ్ యోచించింది. పైగా అప్పటికే మల్లాది ఓ దఫా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు పైగా ఆయన్ను మళ్లీ బరిలోకి దింపితే కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలిందని సమాచారం. దీంతో సెంట్రల్ నుంచి పోటీచేయడానికి దారులు మూసుకుపోయాయ్. ఒకానొక సమయంలో వంగవీటి వర్సెస్ మల్లాది అని చిన్నపాటి గొడవలు సైతం జరిగాయ్. వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లును సైతం కాల్చి.. అప్పట్లో జగన్‌‌పై రాధా అభిమానులు తిట్లదండకం, శాపనార్థాలు పెట్టారు కూడా.

రాధాకు రెండు చాయిస్‌‌లు..!
గత నాలుగు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్న రాధా తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. అసలు పార్టీలో ఉందామా..? వద్దా..? అధినేత తమకు అన్యాయం చేస్తున్నాడని భావించిన రాధా మరోసారి సీటు విషయమై చర్చలు జరిపారు. అయితే హై కమాండ్ మాత్రం తూర్పు లేదా మచిలీపట్నం పార్లమెంట్ అంటూ ఇంకో చాయిస్ కూడా ఇచ్చింది. ఇలా ఎన్నిసార్లు అడిగినా ఇలాంటి సమాధానాలే రావడంతో చేసేదేమీ లేక ఆఖరికి ఆదివారం సాయంత్రం రాజీనామా చేసి బయటికొచ్చేశారు.. ఇదీ రాధా రాజీనామా వెనకున్న అసలు కథ. 

పొమ్మన లేక పొగబెట్టారు..!
వైసీపీకి గుడ్‌ బై చెప్పిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాధా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "పొమ్మనలేక నాకు పొగపెట్టారు. వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న నేను.. చివరికి బయటకు వచ్చేయాలని డిసైడ్‌ అయ్యాను.భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమై చర్చిస్తాను. చర్చల అనంతరం ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాను" అని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే రాధాతో పలువురు సీనియర్లు మంతనాలు, రాయబారాలు ఫలించలేదన్న మాట. అయితే పార్టీకి రాజీనామా చేసిన రాధా ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? ఇంతకీ పోటీ చేస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.