close
Choose your channels

కేరళ బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్

Friday, March 5, 2021 • తెలుగు Comments

ఇటీవల మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరన్ కీలకంగా మారారు. ఆయనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే మిగిలిన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని ఇప్పటికే శ్రీధరన్ ప్రకటించారు.

అయితే ఈ ప్రకటనకు ముందు శ్రీధరన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ యూనిఫాంలో తనకు ఇదే చివరి రోజని తెలిపారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్‌కు రాజీనామా సమర్పించిన తర్వాతే తాను ఎన్నికలకు ముందుకు వెళతానని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంజినీర్‌గా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను దేశానికి శ్రీధరన్ అందించారు. భారత్ లో ప్రజారవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేలా మెట్రో రైలు వ్యవస్థలకు ఊపిరిపోశారు. ప్రస్తుతం తన సొంత రాష్ట్రం కేరళకు ఏదైనా చేయాలని పరితపిస్తున్నారు.

కాగా.. గతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళలో బీజేపీని అందలం ఎక్కించడమే లక్ష్యంగా తాను శ్రమిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని శ్రీధరన్ తెలిపారు. ఒకవేళ తాను కేరళ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గవర్నర్ పదవిపై తనకు ఏమంత ఆశ లేదని, ఆ పదవితో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం ఏమంత ఉండదని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.

Get Breaking News Alerts From IndiaGlitz