close
Choose your channels

ఏపీ సీఎం అభ్యర్థిగా మెగాస్టార్ చిరు.. బంపరాఫర్!?

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరుకు బంపరాఫర్ ఇచ్చిన బీజేపీ.. !?

మెగాస్టార్ చిరంజీవీ మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? చిరు రాకకోసం కమలనాథులు వేచి చూస్తున్నారా..? ఆయన పార్టీలో చేరితో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్ధమైందా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజం..? చిరు నిజంగానే రీ ఎంట్రీ ఇస్తారా..? అనే విషయం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అప్పట్లో ఊపు ఉండేది..!

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తాను రెండు చోట్లు పోసి ఒక్క చోటతో గెలిచి.. తనతో పాటు 18 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చిరు.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడున్న ఊపులో చిరు సీఎం అయినా.. కింగ్ మేకర్ అయ్యున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పార్టీ విలీనం అవ్వడంతో చిరుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాజ్యసభ పదవీకాలం ముగిశాక ఖైదీ నెంబర్-151తో మెగాస్టార్ మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో బిజీబిజీగా ఉన్నారు.

నేతలంతా అటు వైపే..!

అయితే.. ఇక దాదాపు ఆయన రాజకీయాల్లోకి.. రాజకీయాల జోలికి రారని మెగా ఫ్యామిలీనే తేల్చిచెప్పింది. 2019 ఎన్నికల్లో తన తమ్ముడు పార్టీ జనసేన పోటీ చేసినప్పటికీ.. చిరు మాత్రం 1% శాతం కూడా ఆ పార్టీలో చేరడానికి కానీ.. ప్రచారం చేయడానికి కానీ ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ, జనసేన పరిస్థితి అయితే దారుణాతి దారుణంగా పడిపోయింది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ రెండో చోట్ల పోటీచేస్తే ఒక్కచోట కూడా గెలవలేని పరిస్థితి.

చిరు గుర్తొచ్చి..!

ఈ తరుణంలో టీడీపీ, జనసేనకు సంబంధించిన నేతలంతా బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు కాషాయ కండువాలు కప్పుకోగా.. మరికొందరు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీని బలంగా ఢీ కొట్టి.. ఏపీలో జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ తరుణంలో ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది. మంచి జనాధారణ ఉన్న కీలక నేతలకోసం కమలనాథులు వెతుకుతుండగా.. చిరు గుర్తొచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ను పార్టీలో చేరాలని ఢిల్లీ పెద్దలు ఆహ్వానించారట.

ఇప్పుడు రాజ్యసభ.. పార్టీ పగ్గాలు!

పార్టీలోకి వస్తే ఇప్పటికిప్పుడే రాజ్యసభ ఇవ్వడమే కాకుండా.. రాష్ట్ర అధ్యక్షునిగా నియమించి.. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కీలక సామాజిక వర్గం అంతా చిరు వస్తే బీజేపీ మద్దతిచ్చే అవకాశాలుండటంతో కమలనాథులు ఈ ప్లాన్ గీసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ మీద జనాల్లో చాలా వ్యతిరేకత ఉందన్నది జగమెరిగిన సత్యం. అందుకే తమ్ముడి తరఫున కనీసం ప్రచారం చేయడానికి చిరు ఆసక్తి చూపలేదు.

చిరు బీజేపీలోకి చేరితే..!

ఒకవేళ చిరు బీజేపీలో చేరితే జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలనే యోచనలో కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చారు.. మున్ముంథు మరింత బలపడే అవకాశాలు ఉండటంతో తప్పకుండా ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లాలనేది ప్లానట. సో.. ఫైనల్‌గా అప్పుడు అన్నదమ్ములు ఒక్కటయితే వారి హవాతో 2024లో కాకుండా.. ఆ తర్వాత అయినా సరే కచ్చితంగా జెండా పాతేసేయొచ్చని బీజేపీ భావిస్తోందట.

కాగా.. ఈ వార్త గత 24 గంటలుగా హల్‌చల్ చేస్తున్నా ఇంత వరకు మెగా ఫ్యామిలీ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. తమ్ముడి పార్టీలోకి వెళ్లడానికే సాహసించని ఈ ‘సైరా’.. ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ఈ తరుణంలో చిరు పయనమెటో.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు అంటూ నటిస్తూనే ఉంటారో లేకుంటే కమలనాథులు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆకర్షితుడవుతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.