close
Choose your channels

‘కారు’కు బ్రేక్‌కు ‘కమలం’ మాస్టర్ ప్లాన్.. అట్టర్‌ప్లాప్!?

Thursday, September 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘కారు’కు బ్రేక్‌కు ‘కమలం’ మాస్టర్ ప్లాన్.. అట్టర్‌ప్లాప్!?

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మారాలనుకుంటున్న బీజేపీ.. మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోందా..? ప్రస్తుతానికి ఏపీని కాస్త పక్కనెట్టిన కమలనాథులు.. తెలంగాణలోని ‘కారు’ సర్కార్‌ను పూర్తిగా టార్గెట్ చేసిందా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే సీఎం కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చి గులాబీ నేతలకు కాషాయ కండువా కప్పేందుకు వ్యూహం రచిస్తున్నారా..? కేటీఆర్ రంగంలోకి దిగడంతో కమలనాథుల ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అసంతృప్తి సెగ!!

తెలంగాణలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. ‘కారు’ ఫుల్ ఓవర్ స్పీడ్‌తో ఉన్న విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణలో తమకు కచ్చితంగా మంత్రి పదవులు వరిస్తాయని చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని నేతలకు.. కారెక్కిన నేతలకు కేసీఆర్ అవకాశమిచ్చారు. ఈ క్రమంలో చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా.. సీనియర్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, అరికెపూడి గాంధీ, జోగు రామన్న, రాజయ్య.. ఇలా చెప్పకుంటూ పోతే చాత్తాడంతా లిస్ట్ ఉంది.

వీళ్లంతా పార్టీ వీడితే...!

అయితే అసంతృప్తికి లోనైన నేతలను కమలనాథులు టార్గెట్‌గా పెట్టుకుని వారిని కారు దించి కాషాయ కండువా కప్పాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ఉద్దండులను కలిసి పార్టీ మార్పుపై చర్చించినట్లు వార్తలు వినవచ్చాయి. అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగడంతో.. అసంతృప్తులు అంతా శాంతించారు. అంతేకాదు.. ఒక్కొక్కరుగా అసంతృప్తులు స్వయంగా ప్రగతిభవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిసి.. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించి మాట్లాడటం విశేషమని చెప్పుకోవచ్చు. అంటే అసంతృప్తి పరిస్థితులు దాదాపు సద్దుమణిగాయనే చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్.. రంగంలోకి దిగాక పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయన్న మాట.

తాజాగా మరో రచ్చ.. ‘కారు’లో ఉండలేను..!!

బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న షకీల్ బీజేపీ ఎంపీని కలవడంతో... ఆయన పార్టీ మారతారేమో అనే అంశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత కవితకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న షకీల్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా పార్టీలో ఇమడలేకపోతున్నానని, అవసరమైతే, రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పడం గమనార్హం.

మొత్తానికి చూస్తే..‘కారు’ పార్టీకి చెందిన నేతలను తమవైపు లాక్కొని బ్రేక్‌లు వేసేందుకు కమలనాథులు రచించిన వ్యూహాలన్నీ.. కేటీఆర్ రంగంలోకి దిగడంతో అట్టర్ ప్లాప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో.. ప్రస్తుతానికి అంతా ఓకే.. మున్ముంథు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.