close
Choose your channels

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు, 8 మంది దుర్మరణం .. మోడీ, జగన్ దిగ్భ్రాంతి

Sunday, March 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 54 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది.

చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. అనంతరం భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక వున్న పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద ప్రాంతంలో తెగిపడిన శరీర భాగాలు, క్షతగాత్రుల రోదనలు, చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

అయితే చిమ్మచీకటి..పైగా ఘాట్‌ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10.30 గంటల వరకు వెలుగు చూడలేదు. అయితే క్షతగాత్రుల హాహాకారాలతో అటుగా వెళ్తున్న వాహనదారులు అనుమానంతో ఆగి లోయలో దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండటంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే స్థానికులతో కలిసి పోలీసులు లోయలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 నష్ట పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు మోడీ తెలిపారు. అటు భాకరాపేట ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, అలాగే గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.