close
Choose your channels

జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధంలో సీఎం జగన్ గెలుస్తారా?

Monday, October 12, 2020 • తెలుగు Comments

జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధంలో సీఎం జగన్ గెలుస్తారా?

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సర్కార్ యుద్ధం ప్రకటించింది. సీఎంగా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఏ కేసులోనూ ఆయనకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వెలువడింది లేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. కావాలనే తమకు వ్యతిరేకంగా జస్టిస్ ఎన్వీ రమణ పని చేస్తున్నారనేది జగన్ సర్కార్ ప్రధాన ఆరోపణ. దీంతో సీఎం జగన్ కనివినీ ఎరుగని చర్యకు ఉపక్రమించారు. ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి ఎన్వీ రమణ.. రాష్ట్ర హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ.. దానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ రాశారు. ఈ లేఖ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఏపీలో శాసన వ్యవస్థకు, ప్రభుత్వానికి నడుమ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కోల్డ్ వార్ జరుగుతోంది. తాజాగా జస్టిస్ రమణపై సీఎం వైఎస్ జగన్ బహిరంగ యుద్ధం ప్రకటించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇవ్వడం ఇదే తొలిసారి. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా ఓ న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, స్టేల వెనుక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి జగన్ లేఖను అందించారు.

దేశంలో 4500 పెండింగ్ కేసులు..

వాస్తవానికి ఆర్థిక, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులపై కేసుల్లో విచారణ వేగిరం చేయాలని, రోజువారీ విచారణ నిర్వహించి కేసులను సత్వరమే పరిష్కరించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఆ మేరకు దాదాపు అన్ని హైకోర్టులు కార్యాచరణ ప్రకటించాయి. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో సుమారు 4,500 మంది నేతలపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా నేతల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఒకరు. అయితే, కేవలం జగన్‌ను టార్గెట్‌గా చేసుకునే జస్టిస్‌ రమణ ఈ ఉత్తర్వులు ఇచ్చారని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవడమే లక్ష్యమా?

జస్టిస్‌ బాబ్డే పదవీ విరమణ అనంతరం సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అది జరగకుండా అడ్డుకోవడమే వైసీపీ పెద్దల లక్ష్యమని ఆరోపణలు లేకపోలేదు. జస్టిస్‌ రమణ 2000లో ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2013లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2013లోనే ఢిల్లీ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. అంతకుముందే జస్టిస్ రమణ తనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టారంటూ మనోహర్‌రెడ్డి అనే అడ్వకేట్‌ ఆయనపై కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం... కేసును కొట్టివేయడంతోపాటు, పిటిషనర్‌కు రూ.50వేలు జరిమానా విధించింది. అప్పట్లోనే జస్టిస్‌ రమణ హైకోర్టు సీజే కాకుండా వైసీపీ పెద్దలు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.

దమ్మాలపాటి శ్రీనివాస్ వకాల్తా పుచ్చుకున్న కేసుల్లో అనుకూల తీర్పులు!

జస్టిస్‌ రమణ 15ఏళ్ల కిందట హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్‌(మాజీ అడ్వొకేట్‌ జనరల్‌) వకాల్తా పుచ్చుకున్న కేసుల్లో అనుకూల తీర్పులు చెప్పారని వైసీపీ అధిష్టానం ఆరోపిస్తోంది. ఏయే కేసుల్లో తీర్పులు వచ్చాయో కూడా జాబితా రూపొందించారు. వైసీపీ సర్కారు తీసుకున్న పదులకొద్దీ నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసింది. వాటిపై సుప్రీంకు వెళ్లినా ఊరట లభించలేదు. నిర్ణయాలు పునఃసమీక్షించి, తప్పు సరిదిద్దుకోవాల్సిన పెద్దలు... దీనిని న్యాయవ్యవస్థపై దాడికి అస్త్రంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారనేది టీడీపీ వాదన. శాసన వ్యవస్థకు రాజకీయ రంగు పులిమి రచ్చచేస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ ప్రకటించిన ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz