చిరు ఇంట్లో ముగిసిన సీసీసీ స‌మావేశం.. ఎవ‌రేమ‌న్నారంటే?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌ను ఫేస్ చేసింది. ముఖ్యంగా సినీ కార్మికుల‌కు ప‌ని లేకుండా పోయింది. దీంతో వారి సంక్షేమార్థం సీసీసీ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ షూటింగ్స్ త‌దిత‌ర విష‌యాల గురించి సినీ పెద్ద‌లు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ చ‌ర్చ‌ల గురించి త‌న‌కు తెలియ‌ద‌ని బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా త‌ల‌సానితో క‌లిసి సినీ పెద్ద‌లు భూములు పంచుకుంటున్నారా? అని కూడా బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సీసీసీ క‌మిటీ స‌భ్యులు చిరు ఇంట్లో స‌మావేశమ‌య్యారు.
తమ్మారెడ్డి, సి.కల్యాణ్ స్పందన..

ఈ స‌మావేశంలో మ‌రోసారి క‌మిటీ స‌భ్యులు స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాకుండా మొద‌టి విడ‌త సాయం అంద‌ని సినీ కార్మికుల కోసం రెండో విడ‌త‌లో సాయం చేయాల‌ని కూడా అనుకున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం త‌మ్మారెడ్డి భ‌రద్వాజ మాట్లాడుతూ ‘‘అవసరం ఉన్న‌వాళ్ల‌ని పిలిచి మాట్లాడారు. బాల‌కృష్ణ‌తో అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు కూడా వెళ‌తారు. దీన్ని వివాదం చేయ‌న‌వ‌స‌రం లేదు. అలాగే నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని అవేవీ ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు రాలేదు’’ అన్నారు. అలాగే సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ‘‘బాల‌కృష్ణ రియ‌ల్ ఎస్టేట్ అంటూ వ్యాఖ్య‌లు చేసి ఉండ‌కూడ‌దు. మ‌రి ఆయ‌న ఏ ఫ్లోలో అన్నారో తెలియ‌డం లేదు’’ అన్నారు.