లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల వరకు మారటోరియం గడువు పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. కేంద్రం, ఆర్బీఐ తరఫున ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు ప్రారంభమైందని మార్చి 2021 వరకూ మారిటోరియం కొనసాగిస్తామని వెల్లడించారు.

మారటోరియంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈఎంఐలపై అదనపు వడ్డీ విధించొద్దని పేర్కొంది. చెల్లించని ఈఎంఐలపైనా పెనాల్టీ విధించొద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఆగస్ట్‌ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టగా.. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం లభించినట్లయింది.