పబ్‌జి సహా 280 యాప్‌ల నిషేధించనున్న కేంద్రం!

  • IndiaGlitz, [Monday,July 27 2020]

చైనా యాప్‌ల నిషేధంపై కేంద్రం మరోమారు దృష్టి సారించింది. ఇప్పటికే 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. మరోమారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారత్ - చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాపై మరింత ఒత్తిడి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచనగా తెలుస్తోంది. ముందుగా చైనాలో సర్వర్ ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో ఇప్పటికే ఐటీ మాంత్రిత్వ శాఖ ఉన్నట్టు సమాచారం. పబ్‌జి సహా సుమారు 280 యాప్‌లను నిషేధించాలనేది కేంద్రం యోచనగా తెలుస్తోంది. ఈ 280 యాప్‌లపై ఇప్పటికే కేంద్రం నిఘా పెట్టింది. ఈ యాప్‌ల ద్వారా డేటా ఏవిధంగా మార్పు జరుగుతోందో అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

సుమారు 20 యాప్‌ల ద్వారా జరుగుతున్న డేటా ట్రాన్స్‌ఫర్‌ని అధికారులు గుర్తించారు. చైనాలో సర్వర్‌‌లు ఉన్న అన్ని యాప్‌లపై నిషేధం విధించే యోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మరో 47 చైనా యాప్‌లను నిషేధిస్తూ శుక్రవారం కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో నిషేధం విధించిన 59 యాప్‌లకు అనుసంధానం అయిన, మారుపేర్లతో ఉన్న యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. గతంలో 59 యాప్‌లను నిషేధించడంతో దేశీయంగా తయారైన యాప్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మరికొన్ని యాప్‌లను నిషేధించడం ద్వారా దేశీయ యాప్‌లను ప్రోత్సహించడంపై కేంద్రం మరింత దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.