Download App

Chal Mohan Ranga Review

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ హీరోకైనా త‌న 25వ సినిమా అంటే ఓ మెమొర‌బుల్ మూవీయే. అలాంటి మైల్‌స్టోన్ మూవీని ఛ‌ల్ మోహ‌న్ రంగ‌తో మంచి జ్ఞాపకం చేసుకోవాల‌నుకున్న నితిన్‌కి రెండు మంచి అనుభూతులు దొరికాయి. అవేంటంటే.. నితిన్ అభిమాన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అభిమాన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ నిర్మాత‌లుగా మారి త‌న 25వ సినిమాను రూపొందించ‌డం. బేసిక్‌గా రైట‌ర్, డైరెక్ట‌ర్ అయిన త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు క‌థ‌ను అందించారు. కృష్ణ చైత‌న్య సినిమాను డైరెక్ట్ చేశారు. మ‌రి నితిన్‌కి `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` మంచి అనుభూతిగా మిగిలిపోనుందా?  లేదా? అని తెలియాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

మోహ‌న్ రంగ‌(నితిన్‌) మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం.. పెద్ద‌గా చ‌దువుకోడు. చిన్న‌ప్పుడు ఓ అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం ఆమె ఇంటికి వెళితే.. ఆమె అమెరికా వెళ్లిపోయింద‌ని తెలుస్తుంది. దాంతో ఎలాగైనా అమెరికా వెళ్లి ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాల‌నుకుంటాడు. మూడుసార్లు అత‌ని వీసా రిజ‌క్ట్ అవుతుంది. అయితే అదే వీధిలో బామ(రోహిణి హ‌ట్టంగ‌డి) చ‌నిపోవ‌డంతో ఆమె శ‌వాన్ని ఆమె కొడుకుల‌కు అప్ప‌గించాల‌నే సాకు పెట్టుకుని వీసా సంపాదిస్తాడు. అలా అమెరికా వెళ్లిన మోహ‌న్‌కి  బామ కుటుంబ స‌భ్యులు స‌పోర్ట్ చేయ‌రు. ఆ స‌మ‌యంలో మ‌ధునంద‌న్ క‌లుస్తాడు. త‌న స‌హాయంతో అత‌ని ఆఫీస్‌లో ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాల‌నుకుంటాడు. ఆ స‌మ‌యంలో మేఘ‌( మేఘా ఆకాశ్‌) ప‌రిచ‌యం అవుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారి.. ప్రేమ‌ను చెప్పుకోవాలనుకుంటున్న త‌రుణంలో ఇద్ద‌రూ విడిపోతారు. మేఘ కునూర్ వ‌చ్చేస్తుంది. ఆమె కోసం మోహ‌న్ అమెరికా నుండి కునూర్ వ‌స్తాడు. అప్పుడు ఆమెకు పెళ్లి జ‌రుగుతుంటుంది. అప్పుడు మోహ‌న్ ఏం చేస్తాడు?  మోహ‌న్‌, మేఘ‌ల పెళ్లి జ‌రుగుతుందా? అస‌లు అమెరికాలో ఇద్ద‌రూ విడిపోవ‌డానికి కార‌ణాలేంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

నితిన్ సినిమాలో ఫుల్ ఎన‌ర్జీతో న‌టించాడు. త‌నదైన న‌ట‌న‌తో పాత్ర‌లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో అమెరికాకు వ‌చ్చిన‌ప్పుడు పోలీస్ ఆఫీస‌ర్ నుండి త‌ప్పించుకోవ‌డం కోసం అత‌ను చేసే ప్ర‌య‌త్నాలు.. ప్రీ క్లైమాక్స్‌లో తాగి స‌త్య‌ను చిత‌క బాదే స‌న్నివేశం.. స‌హా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో మెప్పించాడు నితిన్‌. ఇక తొలి చిత్రం లై కంటే మేఘా ఆకాశ్ చ‌క్క‌గా న‌టించింది. లిజి చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగు సినిమాల్లో న‌టించింది. ఆమె పాత్ర హుందాగా ఉంది. కృష్ణ‌చైత‌న్య క‌థ‌ను వీలైనంత క్వాలిటీతో చ‌క్క‌గా ప్రెజంట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ముఖ్యంగా కామెడీ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా ప్రెజెంట్ చేశాడు. త‌మ‌న్ ట్యూన్స్ బావున్నాయి. పాట‌లు విన‌డానికి బావుండ‌టంత పాటు పిక్చ‌రైజేష‌న్ బావున్నాయి. న‌ట‌న‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కృష్ణ‌చైత‌న్య త‌న‌దైన కామెడీ స‌న్నివేశాల‌ను సినిమాను ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు న‌డిపించాడు. త‌ను స‌న్నివేశాల‌ను ప్రెజెంట్ చేసిన తీరు.. ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డా బోర్ కొట్టించ‌దు.

మైన‌స్ పాయింట్స్‌:

సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ సినిమా అంటే బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఉంటాయి. ఆ బ‌ల‌మైన ఎమోష‌న్స సినిమాలో క‌న‌ప‌డ‌లేదు. సినిమా క్లైమాక్స్ ముందు వ‌ర‌కు కామెడీ ట్రాక్‌లో న‌డిపించే ప్ర‌య‌త్నంలో ల‌వ్ ఫీల్ కానీ, పాత్ర‌ల మ‌ధ్య ఎమోష‌న్స్ ఉండాల‌నే సంగ‌తిని మ‌రిచిపోయారు. ఇక క‌థ‌లో కొత్త‌దనం లేదు. పాత్ర‌ల తీరు తెన్నులు.. కొన్ని స‌న్నివేశాలు త్రివిక్ర‌మ్ గ‌త చిత్రాల తాలుకాలో క‌న‌ప‌డ‌తాయి. త్రివిక్ర‌మ్ కొత్త‌ద‌నం లేని క‌థ‌తో మ్యాజిక్ చేయాల‌నే ప్ర‌య‌త్నం పరావాలేదంతే.

విశ్లేష‌ణ‌:

ఒక విష‌యం ఒక‌సారి జ‌రిగితే రెండోసారి జ‌ర‌గ‌దు. ఒక‌వేళ రెండోసారి జ‌రిగిందంటే మూడోసారి త‌ప్ప‌కుండా జ‌రుగుతుంది అనేది విధిలో ఓ కాన్సెప్ట్‌. దీన్ని తొలి స‌న్నివేశంలోనే చెప్పించి..తాను ఏం చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశాడు త్రివిక్ర‌మ్‌. ఖుషీ సినిమాలో మందు కొట్టే స‌న్నివేశాన్ని మార్చి ఈ సినిమాలో ఉప‌యోగించారు. అలాగే ఖైదీ నంబ‌ర్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాన్ని ఈ సీన్‌కు లింక్ చేశారు. అజ్ఞాత‌వాసిలో బెల్టుతో కొట్టే సీన్‌ను ఇందులో రిపీట్ చేసిన‌ట్టు అనిపించింది. హీరోయిన్ చెల్లెలు క్యారెక్ట‌ర్ నువ్వు నాకు నచ్చావ్‌లో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను గుర్తుకు తెస్తుంది. సీనియ‌ర్ న‌రేశ్‌, సంజ‌య్ స్వ‌రూప్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేదు. లిజి పాత్ర‌ను హుందాగా చూపించారు కానీ.. ఇంకా ఆమె పాత్ర‌ను చ‌క్క‌గా డిజైన్ చేసుండొచ్చు అనిపించింది. ప్ర‌భాస్ శ్రీను, మ‌ధునంద‌న్, స‌త్య పాత్ర‌లు వాటి ప‌రిధులు మేర చ‌క్క‌గా న‌టించారు. రౌడీ ఫెలో వంటి యాక్ష‌న్ మూవీ తీసిన కృష్ణ‌చైత‌న్య ఈ సినిమాను చ‌క్క‌గానే హ్యాండిల్ చేశాడు.  అయితే క‌థ‌కు స్క్రిప్ట్ రాసుక‌నే సంద‌ర్భంలో కామెడీని దృష్టిలో పెట్టుకున్నారే త‌ప్ప‌... క‌నెక్టింగ్ ఎమోష‌న్స్ ఉండాల‌నే విష‌యం మ‌ర‌చిపోయారు.

బోట‌మ్ లైన్‌: ఛ‌ల్ మోహ‌న్ రంగ‌.. త్రివిక్ర‌మ్ క‌థ‌.. కామెడీ, డైలాగ్స్‌తో పాటు నితిన్ న‌ట‌న అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

Chal Mohan Ranga Movie Review in English

Rating : 3.0 / 5.0