2015లోనే కరోనాపై డ్రాగన్ చర్చ.. వైరస్‌తో ఆయుధాలు!

  • IndiaGlitz, [Monday,May 10 2021]

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని చైనా ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూసిందనే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా చైనాలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేసే విషయమై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారట. సార్స్ కరోనా వైరస్‌లు నూతన శకం జీవాయుధాలంటూ.. ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక సంచలన కథనం ప్రచురించింది. సార్స్(ఎస్ఏఆర్ఎస్) కరోనా వైరస్‌ను బయో ఆయుధంగా ఉపయోగించాలని అనుకుంటున్నట్లుగా చైనా మిలటరీ సైంటిస్టులు, హెల్త్ అధికారులు రాసిన ఒక నివేదికను ఈ పత్రిక బయటపెట్టింది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రు దేశానికి చెందిన వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం భావించినట్టు కథనం సారాంశం.

Also Read: ఆసుపత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఈ వైరస్‌తో బయో ఆయుధాల్లో నూతన శకం ప్రారంభమవుతుందని సదరు నివేదికలో చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్‌ను కృత్రిమంగా మానిప్యులేట్ చేయవచ్చని, ఇలా ఇదొక భయంరకమైన వైరస్‌గా ఎదుగుతుందని వారు రాసుకొచ్చారు. ఆ సమయంలో దీన్ని ఆయుధంగా మార్చి, ఉపయోగించుకోవచ్చని మిలటరీ సైంటిస్టులు అభిప్రాయపడ్డారని యూకే నుంచి వెలువడే ‘ద సన్’ పేర్కొంది. కోవిడ్ 19పై స్వీయ దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈ పత్రాలు చేజిక్కించుకున్నట్టు తెలిపింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఎలాంటి ఘాతులకాలకు పాల్పడతారనేది ఇది రుజువు చేస్తోందని ‘ద సన్’ వెల్లడించింది.

చైనా ప్రభుత్వం నుంచి పత్రాలు ఏవైనా లీక్ అయినప్పుడు అవి నకిలీవో కాదో తేల్చి చెప్పే సైబర్ భద్రతా నిపుణుడు రాబర్ట్ పోటర్.. తాజాగా లీకైన పత్రం నకిలీది కాదని స్పష్టం చేయడం గమనార్హమని ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు పీటర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించారు. ఈ వార్త వెలువడిన తర్వాత ప్రపంచ దేశాలకు మరోసారి చైనాపై అనుమానాలు పెరిగిపోయాయి. గతంలో కూడా కరోనా వైరస్‌ను చైనా కావాలనే ల్యాబుల్లో తయారుచేసిందంటూ పలు దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే వాటికి ఎటువంటి ఆధారాలూ దొరకలేదు. కాగా.. ఆ సమయంలో ఇతర దేశాల శాస్త్రవేత్తలు కరోనా మూలాలపై తమ దేశంలో పరిశోధన చేయకుండా చైనా అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక.. చైనా మిలటరీకి చెందిన డాక్యుమెంట్లను ప్రచురించడంపై దీనిపై మరోసారి చర్చ జరుగుతోంది.